Korutla:: దీప్తి శరీరంపై గాయాలు.. పోస్టుమార్టం నివేదికే కీలకం

కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. 

Updated : 30 Aug 2023 22:30 IST

కోరుట్ల: కలకలం రేపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. చేయి, ఛాతి, చెంప భాగంలో గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో బుధవారం సాయంత్రం కోరుట్లలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మిస్టరీగా మారిన ఈ కేసులో ప్రస్తుతం పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది.

మరో వైపు .. దీప్తి మృతి చెందిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు. మెట్‌ పల్లి డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీప్తి మృతి తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిన ఆమె సోదరి పంపిన ఆడియో మెస్సేజ్‌ చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆడియో మెస్సేజ్‌ను మాధ్యమాల్లో  ప్రసారం చేయొద్దని పోలీసులు సూచించారు.

ఏం జరిగిందంటే?

కోరుట్ల పరిధిలోని భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి(24), చందన, సాయి సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండటంతో ఆదివారం... శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమివ్వగా వారొచ్చి... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. 

డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు పారిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని