Stealing: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చేతివాటం.. రూ.18 కోట్ల విలువైన వస్తువులు మాయం!

విమాన ప్రయాణికుల లగేజీ నుంచి ఏకంగా రూ.18 కోట్ల విలువైన వస్తువులను కాజేశారు. స్పెయిన్‌లోని టెనరీఫ్‌ సౌత్‌ విమానాశ్రయంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

Published : 15 Dec 2023 22:10 IST

మాడ్రిడ్‌: విమాన ప్రయాణికుల లగేజీని సురక్షితంగా భద్రపర్చాల్సిన సిబ్బందే.. తమ చేతివాటం ప్రదర్శించారు. వారివద్ద నుంచి రూ.కోట్ల విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. 14 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.18 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్పెయిన్‌ (Spain)కు చెందిన కానరీ దీవుల్లోని టెనరీఫ్‌ సౌత్‌ విమానాశ్రయంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కానరీ దీవులకు చేరుకునేందుకుగానూ భారీసంఖ్యలో పర్యాటకులు స్థానిక ప్రధాన విమానాశ్రయం ‘టెనరీఫ్‌ సౌత్‌’ను ఆశ్రయిస్తుంటారు. అయితే.. తమ లగేజీలో విలువైన వస్తువులు మాయమవుతున్నాయంటూ విమానాశ్రయానికి ఇటీవలి కాలంలో పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే 14 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో 20 మంది విమానాశ్రయ ఉద్యోగులపై విచారణ కొనసాగుతోంది.

ప్రిన్స్‌ హ్యారీ ఫోన్‌ హ్యాకింగ్‌ నిజమే.. ‘మిర్రర్‌’కు జరిమానా

విమానాల్లో లగేజీని భద్రపరిచే ప్రదేశంలో సిబ్బంది ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణికుల సూట్‌కేస్‌లను బలవంతంగా తెరిచి, అందులోని విలువైన వస్తువులను కాజేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 29 విలాసవంతమైన చేతి గడియారాలు, 120 ఆభరణాలు, 22 ఖరీదైన ఫోన్‌లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనేక ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక దుకాణాల్లో అమ్ముకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని