Prince Harry: ప్రిన్స్‌ హ్యారీ ఫోన్‌ హ్యాకింగ్‌ నిజమే.. ‘మిర్రర్‌’కు జరిమానా

Prince Harry: ఓ పత్రికపై పెట్టిన ఫోన్ ట్యాపింగ్‌ కేసును బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ గెలిచారు. ఆయన ఫోన్‌ను హ్యాక్‌ చేయడం నిజమేనని కోర్టు నిర్ధారించింది.

Published : 15 Dec 2023 18:08 IST

లండన్‌: బ్రిటన్‌ పత్రిక ‘డెయిలీ మిర్రర్‌ (Daily Mirror)’ వార్తాసంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌-3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) వేసిన ఓ దావా కేసులో లండన్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సదరు పత్రికపై చేసిన ఆరోపణలు రుజువు కావడంతో మిర్రర్‌కు 1,40,000 పౌండ్ల జరిమానా విధించింది.

‘‘కొన్ని సంవత్సరాలుగా మిర్రర్‌ గ్రూప్‌ ఈ ఫోన్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు కోర్టు గుర్తించింది. ఇది వారికి ఓ అలవాటుగా మారింది. వ్యక్తుల రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరించేందుకు ఈ సంస్థ కోసం కొందరు ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం గురించి సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు తెలిసినా.. దాన్ని వారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. హ్యారీ (Prince Harry)పై దాదాపు 15 ఆర్టికల్స్‌ను ఇలా చట్టవిరుద్ధంగా సేకరించిన సమాచారంతోనే ప్రచురించినట్లు రుజువైందని కోర్టు వెల్లడించింది.

లైవ్‌లో మరో ‘పుతిన్‌’.. రష్యా అధినేత షాక్‌..!

మిర్రర్‌ గ్రూప్‌ (Mirror Group Newspapers).. అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్‌ హ్యాకింగ్‌ (phone hacking case) ఆరోపణలకు సంబంధించి ప్రిన్స్‌ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. దీనిపై ఈ ఏడాది జూన్‌లో హ్యారీ లండన్‌ కోర్టులో సాక్ష్యం చెప్పారు. బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఇలా కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో అదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ కేసులో రెండు రోజుల పాటు విచారణకు హాజరైన హ్యారీ.. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్‌ గ్రూప్‌ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా ప్రభావితమైందో చెప్పారు. ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడటమే గాక.. 1996 - 2010 మధ్య ప్రైవేటు ఇన్విస్టిగేటర్లను ఉపయోగించి మిర్రర్‌ గ్రూప్‌ (Mirror Group) తన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తెలిపారు. ఇలా చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించినట్లు హ్యారీ కోర్టుకు వివరించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా నేడు తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని