Crime News: సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

Updated : 02 May 2024 16:51 IST

హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది.  నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్‌ చేస్తూ.. భానుకిరణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కింది  కోర్టు ఆదేశాలను సమర్థించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. యావజ్జీవ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సూరి హత్య కేసులో భానుకిరణ్‌ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 4న హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో సూరిని కాల్చి చంపగా.. 2018 డిసెంబర్‌లో అతడికి నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది.

పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మద్దెలచెర్వు సూరి 2009 డిసెంబర్‌ 29న బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసు ఆంక్షల దృష్ట్యా బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండేవారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆయనకు ప్రధాన అనుచరుడే భానుకిరణ్‌. జనవరి 4, 2011న సూరి.. భానుకిరణ్‌తో కలిసి సనత్‌గర్‌ వెళ్తుండగా. వెనకసీట్లో ఉన్న భాను.. సూరిపైకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో షాక్‌ తిన్న  డ్రైవర్‌ మధు వాహనాన్ని ఆపేశాడు. అదే అదునుగా భాను అక్కడి నుంచి పరాయ్యాడు. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్‌లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని