అమానవీయం.. రీల్స్‌ చేయడానికి ఐఫోన్ కోసం బిడ్డను అమ్మేశారు

సామాజిక మాధ్యమాల మోజులో పడి చాలా మంది కుటుంబ బంధాలను తెంచేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచే ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.

Published : 27 Jul 2023 18:39 IST

కోల్‌కతా: ఆకలేస్తే ఏడవడం.. ఆ ఏడుపు విని.. అమ్మ చేతుల్లోకి తీసుకోగానే.. చనుబాలు తాగి, హాయిగా అమ్మ పొత్తిళ్లలో నిద్రపోవడం. అంతే ఆ పసికందుకు తెలిసింది. అమ్మతనం చేతులు మారినా.. కన్నతల్లి తనను అంగట్లో సరుకులా అమ్మేసినా.. ఎప్పటిలానే ఆకలేయగానే ఏడవడం మినహా ఏం చేయలేని నిస్సహాయత. ఒకవేళ ఆ పసికందు పెరిగి పెద్దయ్యాక నిజం తెలిస్తే.. ఎందుకు తనను అంగట్లో సరుకును చేశారని తప్పక ప్రశ్నిస్తాడు. కన్నవారి దౌర్భ్యాగపు ఆలోచనను తప్పక ఛీత్కరించుకుంటాడు. 

సామాజిక మాధ్యమాల మోజులో పడి చాలా మంది కుటుంబ బంధాలను తెంచేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో చోటుచేసుకున్న ఈ ఘటన. సోషల్‌ మీడియా రీల్స్‌ మోజులో పడి ఐఫోన్ (iPhone) కోసం కన్న కొడుకునే అమ్మేసిన ఆ దంపతుల చర్య సభ్యసమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పానిహతిలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన జయదేవ్‌, సాథి దంపతులకు ఏడేళ్ల కూతురు, 8 నెలల కొడుకు ఉన్నారు. కొద్దిరోజులుగా భార్యభర్తల ప్రవర్తనలో మార్పురావడం చుట్టుపక్కల ఉండే వారికి అనుమానం కలిగింది.  వారితోపాటు 8 నెలల కొడుకు కనిపించకపోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరిచింది. దాంతోపాటు ఆ దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రీల్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గుర్తించారు. పసికందు గురించి స్థానికులు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు జయదేవ్‌, సాథి తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో భార్యభర్తలను అదుపులోకి తీసుకుని విచారించారు. 

బైకర్‌ నిర్లక్ష్యం.. కారు ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడిన విద్యార్థినులు

సోషల్‌ మీడియా రీల్స్‌ చేసేందుకు ఐఫోన్ కొనాలని నిర్ణయించుకుని.. బిడ్డను ఖార్‌దాహ్‌ ప్రాంతంలో నివసించే ప్రియాంక అనే మహిళకు అమ్మేసినట్లు తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. పసికందును అమ్మిన తర్వాత కుమార్తెను కూడా అమ్మేందుకు జయదేవ్ ప్రయత్నించాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని స్థానిక కౌన్సిలర్‌ తారక్ గుహ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జయదేవ్‌, సాథిలతోపాటు పసికందును కొన్న మహిళను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని