బైకర్‌ నిర్లక్ష్యం.. కారు ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడిన విద్యార్థినులు

కర్ణాటక (Karnataka)లోని రాయ్‌చూర్‌ జిల్లాలో బైకర్‌ నిర్లక్ష్యం కారణంగా వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాఠశాల విద్యార్థినులను వెనుక నుంచి ఢీకొట్టింది. 

Published : 27 Jul 2023 14:58 IST

బెంగళూరు: రోడ్డుపై ప్రయాణించేప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వ్యక్తులు తమతోపాటు.. ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తారు. తాజాగా కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదమే అందుకు ఉదాహరణ. రాయ్‌చూర్‌ జిల్లాలో బైకర్‌ నిర్లక్ష్యం కారణంగా వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పాఠశాల విద్యార్థినులను వెనుక నుంచి ఢీకొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

రాయ్‌చూర్‌ (Raichur)లోని రాఘవేంద్ర పెట్రోల్‌ బంక్‌ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద వివరాలిలా ఉన్నాయి. రోడ్డుపై ఒక కారు వేగంగా వస్తుండగా.. అవతలివైపు నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి సడెన్‌గా యూటర్న్ తీసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చాడు. దీంతో కారు వేగాన్ని అదుపుచేయలేక డ్రైవర్‌.. బైక్‌ను ఢీకొట్టి, పక్కనే రోడ్డుపై నడుస్తున్న నలుగురు విద్యార్థినులపై దూసుకెళ్లాడు. ఈ ఘటనలో బైక్‌ పైనున్న వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరిపడిపోయాడు. వెనక నుంచి కారు  ఢీకొట్టడంతో ఒక విద్యార్థిని పక్కకు పడిపోగా.. మరో విద్యార్థిని గాల్లోకి ఎగిరి కొంత దూరంలో పడిపోయింది.

ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని