logo

అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే

వందశాతం పోలింగ్‌ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్‌కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు.

Published : 20 May 2024 03:19 IST

1,515 మందికే హోం ఓటింగ్‌ సదుపాయం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం :  వందశాతం పోలింగ్‌ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్‌కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలో 1,515 మంది మాత్రమే ఇంటి వద్ద ఓటేయడమే ఇందుకు నిదర్శనం. అత్యధికంగా వృద్ధులు, దివ్యాంగులు అపసోపాలు పడి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది.

ఎనభై అయిదేళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతానికిపైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటేసే విధానం కిందటి శాసనసభ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 3 నుంచి 8వరకు దరఖాస్తు చేసుకున్న వారి చేత ఇళ్లకు వెళ్లి ఓటు వేయించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 9,350 మంది వయోవృద్ధులు, 11,963 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో 5,431 మంది వయోవృద్ధులు, 4,234 మంది దివ్యాంగులు, కుమురం భీం జిల్లాలో అత్యల్పంగా 5,770 మంది వృద్ధులు, 6,764 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా నిర్ధారించింది. క్షేత్రస్థాయిలో 1,596 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అత్యవసర సేవల్లో పని చేసే ఉద్యోగులకు అవకాశం కల్పించడంతో 13 మంది దరఖాస్తు చేసుకుని వారంతా ఇంటి వద్దే ఓటేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 94.92 శాతం మేర పోలింగ్‌ నమోదు చేసినా.. అర్హత ఉండి అవగాహన లేమి, ప్రచార లోపం, అధికార యంత్రాంగం పట్టింపులేనితనం ఫలితంగా 12డీ ఫారం పూరించని వారెందరో పోలింగ్‌ కేంద్రాలకు ఇబ్బందులు పడుతూ వచ్చారు.


తప్పని అవస్థలు

ఆదిలాబాద్‌ పట్టణం మహాలక్ష్మివాడ 246 పోలింగ్‌ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న 95 ఏళ్ల తన తల్లి చంద్రబాయిని ఓటు వేయించేందుకు ఇలా ఎత్తుకొని తీసుకొచ్చాడు ఆమె కుమారుడు జోగు గంభీర్‌. ఇంటి వద్ద ఓటేసే అవకాశమున్నా ఇలాంటి వారెందరో ఆ అవకాశం వినియోగించుకోలేకపోయారు. 


పట్టణాల్లోనే ప్రచారం

ఓటు నమోదు, వినియోగంపై స్వీప్‌ విభాగం ప్రచారం చేసినా.. అది పట్టణాలకే పరిమితమైంది. జిల్లా అధికారుల మెప్పు పొందడానికి ప్రయత్నించారే తప్ప అసలైన ఓటర్లకు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం జరగలేదు. పెద్ద హోర్డింగ్‌ల ఏర్పాటు, ఒకట్రెండు చోట్ల మండల కేంద్రాల్లో ప్రచారం మినహాయిస్తే గ్రామస్థాయిలో అసలు ఆ దృశ్యాలే కనిపించలేదన్న విమర్శలు వినిపించాయి.


పరిమితంగానే..

ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలో 94.92 శాతం మంది వయోవృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల సిబ్బంది హోం ఓటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 81 మంది మాత్రమే వివిధ కారణాలతో ఓటింగ్‌కు దూరమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని