women health: అమ్మాయి నుంచి అమ్మమ్మ వరకూ..

ఆరోగ్య సంరక్షణ నిరంతర ప్రక్రియ. రజస్వల ముందు నుంచి మొదలుకొని నెలసరి నిలిచిన తర్వాతా జాగ్రత్త అవసరం. ఇందుకు ఎవరికివారే శ్రద్ధ తీసుకోవాలి. వెల్‌ బేబీ క్లినిక్‌ మాదిరిగానే అడలసెంట్‌ క్లినిక్,

Published : 28 May 2024 00:32 IST

నేడు అంతర్జాతీయ మహిళల ఆరోగ్య దినం

ఆరోగ్య సంరక్షణ నిరంతర ప్రక్రియ. రజస్వల ముందు నుంచి మొదలుకొని నెలసరి నిలిచిన తర్వాతా జాగ్రత్త అవసరం. ఇందుకు ఎవరికివారే శ్రద్ధ తీసుకోవాలి. వెల్‌ బేబీ క్లినిక్‌ మాదిరిగానే అడలసెంట్‌ క్లినిక్, వెల్‌ వుమెన్‌ క్లినిక్, మెనోపాజ్‌ క్లినిక్‌ ఉన్నాయనీ తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన టీకాలు తీసుకోవటం, ముందస్తు పరీక్షలు చేయించుకోవటం ద్వారా సమస్యలను గొడ్డలి వరకూ తెచ్చుకోకుండా గోటితోనే ఆపేయొచ్చు. 

యుక్తవయసులో.. 

గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ నివారణకు సమర్థమైన హెచ్‌పీవీ టీకా అందుబాటులో ఉంది. దీన్ని 9-15 ఏళ్ల వయసులో వేయించుకోవాలి. ఈ వయసులో రెండు మోతాదులు చాలు. ఒక మోతాదు తీసుకున్నాక ఆర్నెల్లకు రెండో మోతాదు తీసుకోవాలి. చిన్న వయసులో తీసుకుంటే యాంటీబాడీలు పెద్దమొత్తంలో తయారవుతాయి. 15 ఏళ్ల తర్వాత అయితే మూడు మోతాదులు అవసరం. ఒక మోతాదు తీసుకున్నాక రెండు నెలలకు మరో మోతాదు.. అనంతరం నాలుగు నెలల తర్వాత మూడో మోతాదు తీసుకోవాలి. అలాగే రుబెల్లా బూస్టర్‌ టీకా కూడా తీసుకోవాలి. దీన్ని చిన్నప్పుడు తీసుకోకపోతే పెళ్లయ్యాక గర్భం ధరించినప్పుడు రుబెల్లా ఇన్‌ఫెక్షన్‌ వస్తే బిడ్డకు అవకరాలు తలెత్తే ప్రమాదముంది. చిన్నప్పుడు ఈ టీకాను వేయించుకోనివారు పెళ్లయ్యాకా తీసుకోవచ్చు. కాకపోతే వెంటనే సంతానం కోసం ప్రయత్నించొద్దు. కనీసం నెల వరకైనా ఆగాలి.

 సంతానాన్ని కనే వయసులో..

సంతానాన్ని కనటానికి ప్రయత్నించే సమయంలో థలసీమియా కారక జన్యు పరీక్ష అవసరం. థలసీమియా మైనర్‌లో పైకి ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ వీరి ద్వారా సంతానానికి జబ్బు సంక్రమించొచ్చు. భార్య థలసీమియా మైనర్‌ అయినట్టయితే భర్తకూ పరీక్ష చేయాలి. ఎందుకంటే ఇద్దరూ మైనర్‌ అయినట్టయితే పుట్టబోయే పిల్లలకు థలసీమియా మేజర్‌ వచ్చే అవకాశముంటుంది. ఇది పెద్ద సమస్య. కాబట్టి సంతానాన్ని కనటానికి ప్రయత్నించేవారు ముందే థలసీమియా పరీక్ష చేయించుకోవాలి. అలాగే బ్లడ్‌ గ్రూప్, హిమోగ్లోబిన్, థైరాయిడ్, మధుమేహం, అధిక రక్తపోటు పరీక్షలూ అవసరమే. ఇప్పుడు ప్రతి నలుగురు గర్భిణుల్లో ఒకరికి మధుమేహం బయటపడుతుండటం గమనార్హం. ఇటీవల చాలామందిలో విటమిన్‌ బి12, విటమిన్‌ డి తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటిని కూడా పరీక్షించుకోవాలి. 

 మధ్యవయసులో..

ఏ జబ్బూ లేకపోయినా 35 ఏళ్లు దాటిన వారంతా కనీసం ఏడాదికి ఒకసారైనా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వయసులో అతి ముఖ్యమైంది రొమ్ముల పరీక్ష. ఎవరికివారు సొంతంగానూ రొమ్ములను పరీక్షించుకోవచ్చు. కానీ డాక్టర్‌తో పరీక్షించుకుంటే మంచిది. డాక్టర్లు తమ అనుభవంతో రొమ్ములను చేత్తో తాకి నిశితంగా పరిశీలిస్తారు. 

  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించటానికి పాప్‌స్మియర్‌ తోడ్పడుతుంది. దీన్ని 35 ఏళ్లు దాటిన తర్వాత చేయించుకోవాలి. నెగెటివ్‌గా వస్తే మూడేళ్లకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. హెచ్‌ఐవీ, జననాంగ ఇన్‌ఫెక్షన్లు గలవారైతే తరచూ పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. హెచ్‌పీవీ టీకా తీసుకున్నా ఈ పరీక్ష అవసరమని గుర్తించాలి.
  • గర్భాశయ ముఖద్వారంలో తలెత్తే కొన్ని మార్పులు స్కాన్‌లో కనిపించకపోవచ్చు. ఇక్కడే స్పెక్యులమ్‌ పరికరం తోడ్పడుతుంది. దీంతో లోపలి భాగాన్ని నేరుగా చూడొచ్చు. అదే సమయంలో పాప్‌స్మియర్‌ పరీక్ష కోసం నమూనా కూడా తీయొచ్చు. 
  • పాప్‌స్మియర్‌ పరీక్ష చేయటానికి తగినంత నిపుణులు అందుబాటులో లేని చోట్ల హెచ్‌పీవీ హైరిస్క్‌ డీఎన్‌ఏ పరీక్ష ఎంతో మేలు చేస్తోంది. ఇందులో క్యాన్సర్‌ కారక వైరస్‌లుంటే తెలుస్తాయి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్నే సిఫారసు చేస్తోంది. అయితే హెచ్‌పీవీ వైరస్‌ పాజిటివ్‌గా ఉన్నా క్యాన్సర్‌ రావాలనేమీ లేదు. కానీ అప్రమత్తంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాల్పోస్కోపీతో అసాధారణ మార్పులను గుర్తించొచ్చు. వీటిని ముందుగానే గుర్తించి, చికిత్స ఆరంభిస్తే క్యాన్సర్‌తో మరణించకుండా కాపాడుకోవచ్చు. 
  • 35 ఏళ్లు పైబడ్డవారు కనీసం ఒకసారైనా రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించే మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నెగెటివ్‌గా వచ్చినా ప్రతి మూడేళ్లకోసారి దీన్ని చేయించుకోవాలి. 

నెలసరి నిలిచిన తర్వాత

ముట్లుడిగిపోయే దశలో (ప్రిమెనోపాజ్‌) కొన్నిసార్లు నెలసరి సమయంలో ఎక్కువ రుతుస్రావం కావొచ్చు. చాలామంది ఇది సహజమేనని భావిస్తుంటారు. ఇది తగదు. విధిగా డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షించు కోవాలి. గర్భాశయం లోపలి పొరల్లో వచ్చే క్యాన్సర్‌లోనూ రక్తస్రావం కావొచ్చు. దీన్ని ముందుగా గుర్తిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

  • ఏడాది వరకూ నెలసరి రాకపోతే ముట్లుడిగాయని అర్థం. దీని తర్వాత తిరిగి ఎప్పుడైనా రుతుస్రావమైతే విధిగా డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇది చాలావరకూ ప్రమాదమేమీ కాదు గానీ కొన్నిసార్లు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. 
  • అరుదే అయినా అండాశయాల్లోనూ క్యాన్సర్‌ రావొచ్చు. దీనికి ముందస్తు పరీక్షలేవీ లేవు. ఇప్పుడు ఆల్గోరిథమ్‌ల సాయంతో స్కాన్‌ దృశ్యాలను పరిశీలించి అంచనా వేసే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటితో క్యాన్సర్‌ను అంచనా వేయొచ్చు. ముఖ్యంగా నెలసరి నిలిచాక అండాశయాల్లో గడ్డల్లాంటివి తలెత్తినవారు ఈ పరీక్ష చేయించుకోవటం మంచిది. 

ఎంతసేపూ ఇంటిల్లిపాది అవసరాలను పట్టించుకోవటమే కాకుండా మహిళలు తమ ఆరోగ్యం గురించీ ఆలోచించుకోవాలి. ఏదో నలతగా ఉందనో.. తలనో, కడుపో నొస్తే ఏమవుతుందిలే అనో అనుకోవద్దు. పెద్ద సమస్యలైనా చిన్నగానే మొదలవుతాయి. ముందే జాగ్రత్త పడితే ముదరకుండా చూసుకోవచ్చు. కుటుంబసభ్యులు సైతం ఆడవారి ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని