logo

హద్దు దాటి దోపిడీ

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ చెక్‌పోస్టుల్లో దోపిడీ పర్వం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నెలకు సుమారుగా రూ.కోటి వరకు ప్రైవేటు సిబ్బందిని పెట్టి మరీ అధికారులు వసూలు చేస్తున్నారు

Updated : 08 Mar 2024 06:36 IST

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో నెలకు రూ. 2 కోట్ల వరకు వసూలు

 

వాంకిడి చెక్‌పోస్టు వద్ద వాహనాలు ఆపుతున్న ప్రైవేటు వ్యక్తి

ఈనాడు, ఆసిఫాబాద్‌: రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ చెక్‌పోస్టుల్లో దోపిడీ పర్వం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నెలకు సుమారుగా రూ.కోటి వరకు ప్రైవేటు సిబ్బందిని పెట్టి మరీ అధికారులు వసూలు చేస్తున్నారు. పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన చోదకుల జేబులను చెక్‌పోస్టు నిర్వాహకులు కొల్లగొడుతున్నారు. ఈ మార్గంలోనే టోల్‌ప్లాజా, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉన్న చెక్‌పోస్టులతో రూ.వేల డబ్బులు కోల్పోవాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్ర సరిహద్దు మండలం వాంకిడిలో ఆర్టీఏ, వ్యవసాయ, ఆబ్కారీ శాఖ చెక్‌పోస్టులు ఉన్నాయి. వాహనం పరిమితికి మించిన బరువుతో వెళ్తోందా లేదా, చోదకుడి, వాహన ధ్రువపత్రాలు, వేబిల్లు వంటి అంశాలు ఆర్టీఏ అధికారులు పరిశీలించాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సరకులకు మార్కెట్ రుసుంను వ్యవసాయ మార్కెట్ అధికారులు వసూలు చేయాలి. మద్యం అక్రమ రవాణాను ఆబ్కారీ శాఖ అధికారులు నిరోధించాలి. క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా.. ఈ ప్రాంతంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రతి చోదకుడు రూ.300 ఆర్టీఏ చెక్‌పోస్టులో సమర్పించుకోవాల్సిందే. చక్రాల పరిమాణం పెరిగితే ఈ ధర రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉంటోంది. ఈ మార్గంలో నిత్యం 2500 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి వాహనానికి రూ.300 చొప్పున లెక్క తీసినా నిత్యం రూ.7.50 లక్షలు, నెలకు రూ.2.25 కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఈ తంతు కొనసాగిస్తున్నారు.

పత్తి వాహనానికి రూ.500

రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని రాజురా, చంద్రపూర్‌ మార్కెట్లకు జిల్లా నుంచి పత్తిని తరలిస్తుంటారు. ఐచర్‌ వాహనంలో 25 క్వింటాళ్ల పత్తి తీసుకెళ్తారు. వ్యవసాయశాఖ చెక్‌పోస్టులో రూ.2500 వరకు రుసుం చెల్లించాలి. కానీ ప్రతి పత్తి వాహనానికి రూ.500 వరకు తీసుకుని సంబంధిత సిబ్బంది రశీదులు ఇవ్వకుండానే విడిచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రూ. 10 చొప్పున నిత్యం రూ. 25 వేలు

ఆబ్కారీ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి బహిరంగంగా రోడ్డు మీదే వాహనదారుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఏ వాహనమైనా ఆబ్కారీ చెక్‌ పోస్టు వద్ద అడ్డంగా నిల్చొన్న ప్రైవేటు వ్యక్తికి రూ.10 చోదకుడు చేతిలో పెట్టగానే దారి వదిలేస్తారు. వీరి నెల సంపాదన రూ.7.50 లక్షల వరకు ఉంటోంది.


ప్రతిసారి ఇవ్వాల్సిందే..
- యాదవ్‌, మహారాష్ట్ర  

మహారాష్ట్రలోని గడ్చిరోలికి ఆయిల్‌ ట్యాంకర్‌ను (ఎంహెచ్‌34జీ 6339) తీసుకెళ్తున్నాను. రూ.400 ఆర్టీఏ చెక్‌పోస్టులో తీసుకున్నారు. ఆరు కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలో రూ.1000, వాంకిడి వద్ద టోల్‌ప్లాజా రూ.300 ఈ విధంగా వచ్చిన ప్రతిసారి అధికంగా ఇవ్వాల్సి వస్తోంది.


రూ. 600 తీసుకున్నారు
- పవన్‌, చోదకుడు  

మహారాష్ట్రకు గోధుమల లోడ్‌తో వాహనాన్ని (ఎంహెచ్‌40 సీజీ 1323) తీసుకెళ్తున్నా. 16 చక్రాల వాహనం ఉండడం వల్ల రూ.500 మొదలు తీసుకున్నారు. అనంతరం మరో వంద ఇవ్వాలని పిలిచి మరీ రూ.600 తీసుకున్నారు. అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. అయినా ప్రతిసారి ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు