logo

తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి

జన్నారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది.

Published : 28 Apr 2024 03:14 IST

ఇద్దరూ తిమ్మాపూర్‌ వాసులే..

ఆత్రం సుగుణ , వెంకటేశ్‌నేత

జన్నారం, న్యూస్‌టుడే: జన్నారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ నేత పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. మరొకరు ఆత్రం సుగుణ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ అయిదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు.

జన్నారం మండలంలో తిమ్మాపూర్‌ అనేది ఓ కుగ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జిస్టిస్‌ చంద్రయ్య బాధ్యతలు తీసుకోవడంతో ఒక్కసారిగా గ్రామం పేరు రాష్ట్రస్థాయికి వెళ్లింది. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి భారాస అభ్యర్థిగా బోర్లకుంట వెంటేశ్‌నేత పోటీచేసి గెలుపొందడంతో గ్రామం పేరు దేశరాజధాని వరకు వెళ్లింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఆత్రం సుగుణ పురిటి గడ్డ ఇదే. వివాహం తరువాతనే విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆమె ప్రస్తుతం లోక్‌సభలో అడుగు పెట్టే వరకు అలుపెరుగని బాటసారిలా తన పయనం సాగిస్తానంటోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి తిమ్మాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం డ్రాపౌట్‌ అయ్యారు. ఆనాటి గురువులు అనంతయ్య, రాఘవరావు చొరవతో తపాల్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు చదువుకున్నారు. పెళ్లికి ముందు ఎనిమిదో తరగతి మాత్రమే పూర్తి చేశారు. అనంతరం జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన ఆత్రం భుజంగరావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)తో వివాహం అయ్యాక తొమ్మిది, పది, ఇంటర్‌, డిగ్రీ, బీఎడ్‌ పూర్తి చేశారు. భర్త భుజంగరావు సహకారంతోనే 2010లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తమ గ్రామానికే చెందిన ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతను స్ఫూర్తిగా తీసుకొని, భర్త ఆత్రం భుజంగరావు సహకారంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు సుగుణ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని