logo

మండే ఎండతో జాగ్రత్త..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Published : 28 Apr 2024 03:15 IST

ఆరెంజ్‌ జోన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆరెంజ్‌ జోన్‌లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత, వడగాల్పుల కారణంగా వడదెబ్బ తగిలి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. మరో వారం రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచనలు చేశారు.

ఉమ్మడి జిల్లాలో శనివారం సగటు 42.3 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత పెరిగింది. వేసవి ప్రారంభంలో అప్పుడప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం, మధ్యలో వర్షం కురవడంతో వేసవి తీవ్రత అంతగా కనిపించలేదు. రెండ్రోజుల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న అయిదు రోజులపాటు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వేడి తీవ్రత తగ్గిన తర్వాత వెళ్తే మేలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రమాద ఘంటికలు..

  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న మండలాల్లో అత్యధికంగా బేలలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జైనథ్‌, భీంపూర్‌, సిరికొండ, చెప్రాల ప్రాంతాల్లో 43 డిగ్రీలు, మావల, గుడిహత్నూర్‌, ఆదిలాబాద్‌, తలమడుగు తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
  • కుమురం భీం జిల్లాలో రెబ్బెన, తిర్యాణి, పెంచికల్‌పేట, దహెగాం, కాగజ్‌నగర్‌, కెరమెరిలో అత్యధికంగా 44 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ఆసిఫాబాద్‌, కౌటలలో 43.5 డిగ్రీలుగా నమోదైంది.
  • నిర్మల్‌ జిల్లాలో దస్తూరాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కడెం, ఖానాపూర్‌, నర్సాపూర్‌, లక్షణచాంద, మామడ, ముథోల్‌, దిలావర్‌పూర్‌ మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించారు.
  • మంచిర్యాల జిల్లాలో నస్పూర్‌ ప్రాంతంలో అత్యధికంగా 44.8 డిగ్రీలుగా నమోదైంది. దండేపల్లి, కాసిపేట, చెన్నూర్‌, జన్నారం, భీమిని, కోటపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలకు పైగా నమోదు కాగా, మంచిర్యాలలో 43 డిగ్రీలుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు