logo

అవగాహన లేక.. అనుమతి పొందక..!

పెళ్లి.. రిసెప్షన్‌.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు.

Published : 28 Apr 2024 03:22 IST

వేడుకల్లో యథేచ్ఛగా మద్యం ఏర్పాటు

ఓ ఫంక్షన్‌హాల్‌లో మద్యం సీసాలు

న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం: పెళ్లి.. రిసెప్షన్‌.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. అందరికీ సౌలభ్యంగా ఉండాలన్న కోరికతో ఖర్చు ఎక్కువైనా ఫంక్షన్‌హాళ్లను ఉపయోగించుకుంటున్నారు. నోరూరించే భోజనాలు సిద్ధం చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి అక్కడే మద్యం కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఈ కారణంగానే పల్లె, పట్నం తేడాలేకుండా అన్నిచోట్లా ఫంక్షన్‌హాళ్లు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వేడుక నిర్వాహకుల అవగాహన లేమి, వేదిక యాజమాన్యాల పట్టింపులేనితనం కారణంగా తగిన అనుమతులు లేకుండానే మద్యపానం కొనసాగిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధమని చాలామందికి తెలియకపోవడం గమనార్హం.

పట్టించుకోక..

మా అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న ఫంక్షన్‌హాల్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మద్యం, పేకాట కొనసాగిస్తున్నారు. వచ్చినవారు వాహనాలను ఇష్టారీతిన నిలిపేస్తున్నారు. అర్ధరాత్రులు డీజే చప్పుళ్లతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం సీసాలను దారిలో వదిలేయడం, అపార్ట్‌మెంట్‌ వాళ్లతో గొడవపడటం సర్వసాధారణంగా మారాయి. దీనివల్ల ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. మీరైనా స్పందించి తగిన న్యాయం చేయండి. అంటూ జిల్లాకేంద్రానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

వేడుక అనగానే చాలామంది విందుతో పాటు మందు (మద్యం) కూడా ఏర్పాటుచేయాలనే భావనతో ఉంటున్నారు. ఈ కారణంగానే ఓ పక్క సిట్టింగ్‌, మరో పక్క భోజనాలు అనే రీతిలో కొనసాగిస్తున్నారు. వచ్చినవారికి ఇది సౌలభ్యంగానే ఉంటున్నా.. చుట్టుపక్కల వారికి ఆటంకంగా మారుతోంది. పైపెచ్చు.. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆబ్కారీ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఇలా వేడుకల్లో సిట్టింగ్‌ ఏర్పాటుచేయడం చట్టరీత్యా నేరం. దీనివల్ల వేడుక నిర్వాహకులే కాదు, సంబంధిత ఫంక్షన్‌హాల్‌ యాజమాన్యంపైనా కేసు నమోదుచేసేందుకు ఆస్కారముంటుంది. ఈ విషయాలపై యాజమాన్యాలకు అవగాహన ఉన్నా.. అది నిర్వాహకులకు చెప్పటం లేదు. ఫలితంగా చాలామంది ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్ఛగా ఈ తతంగం కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పేకాట సైతం సాగుతోందనే విమర్శలున్నాయి.  

రుసుము చెల్లించి..

ఆనందంగా జరుపుకొనే వేడుకల్లో మద్యం ఏర్పాటుచేసే విధానం ఆక్షేపణీయం. తప్పదనుకునే సందర్భంలో అనుమతి పొందాలి. ఏ రోజు వేడుక ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది, మద్యం ఏర్పాటుచేసే విషయాలను తెలియజేస్తూ ఆబ్కారీ అధికారులకు ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. సగటున రూ.10 వేల వరకు ఉండే రుసుమును చెల్లిస్తే తాత్కాలిక అనుమతి జారీ అవుతుంది. దీనివల్ల వేడుక జరిగే సమయంలో అధికారులు తనిఖీ చేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ అనుమతి లేకపోతే నలుగురిలో నవ్వులపాలవుతాం. అనుకోకుండా ఎవరైనా ఫిర్యాదుచేసినా, అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేసినా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. రూ. లక్షలు ఖర్చుపెట్టి ఎంతో ఆనందంగా జరిపే వేడుకకు ఇలాంటి అనుమతి పొందాలనే విషయంపై అవగాహన లేక పట్టించుకోవడం లేదు.

చర్యలు తీసుకుంటాం

వేడుక ఏదైనా వచ్చినవారి సౌలభ్యం కోసం మద్యం ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా అలాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటే అనుమతి తీసుకోవాలి. అదే రోజు దరఖాస్తు చేసుకున్నా అనుమతి జారీచేస్తాం. రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయమై సరైన అవగాహన లేక చాలామంది అనుమతి పొందడం లేదు. కొందరు తీసుకుంటున్నారు. అనుమతి లేకుండా మద్యం ఏర్పాటుచేస్తే తనిఖీల్లో ఈ విషయం బయటపడితే చర్యలు తప్పవు.

రజాక్‌, ఆబ్కారీ పర్యవేక్షకుడు, నిర్మల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని