logo

పరిమితి మించితే చిక్కులే..

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు.

Published : 29 Apr 2024 02:31 IST

ఎన్నికల వ్యయంపై ఈసీ ప్రత్యేక నిఘా

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణపర్వం పూర్తయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. ఇందులో కొందరు ర్యాలీలు నిర్వహించి నామినేషన్లను దాఖలు చేయగా.. ఎన్నికల ఖర్చుల లెక్క చూపాల్సి ఉంటుందని మరికొందరు సాదాసీదాగా వేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టగా.. నామపత్రాల ఉపసంహరణ అనంతరం ప్రచార వ్యూహానికి పదును పెట్టనున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, ఇతర కార్యక్రమాల ఖర్చులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది..

ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలే..

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదనే నిబంధన పెట్టింది. ఒకవేళ పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవికి ఎసరు తప్పదు. గతంలో రూ.70 లక్షలు ఉండేదాన్ని రూ.95 లక్షలకు ఎన్నికల సంఘం పెంచింది. ప్రచార సరళి, సభలు, సమావేశాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.

నామినేషన్ల నుంచే..

అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలు, సభలు, సమావేశాలు, భోజనాలు, వాహనాలు ఇతర అసవరాలకు సంబంధించి అధికారులు ఖర్చులను పక్కాగా లెక్కిస్తున్నారు. ప్రతి అభ్యర్థికి రూ.95 లక్షల వరకు వెసులుబాటును కల్పించారు. పార్టీల సమక్షంలోనే స్థానిక ధరలకు అనుగుణంగా ఆమోదముద్ర వేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ధరలు వేర్వేరుగా ఉండటంతోనే స్థానిక ధరలకు అనుగుణంగా నిర్ణయించారు. నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థి వెచ్చించే ప్రతి పైసాకు లెక్క చూపాల్సి ఉంటుంది. నామినేషన్‌ వేయడానికి ఒకరోజు ముందు తెరిచిన బ్యాంకు ఖాతాలో అభ్యర్థులు ఎన్నికల లావాదేవీలను నమోదు చేయాల్సి ఉంటుంది.


వ్యయ పరిశీలకుల పర్యటన ఇలా..

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఎన్నికల సంఘం ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన వారిని ఐఆర్‌ఎస్‌, ఐడీఏఎస్‌ సర్వీస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. వీరు సదరు లోక్‌సభ స్థానం పరిధిలో మూడుసార్లు పర్యటిస్తారు. నామపత్రాల దాఖలు మొదలుకొని చివరి వరకు, ఉపసంహరణ అనంతరం నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోనే మకాం వేస్తారు. ఓటర్లను ఎక్కడెక్కడ ఎలా ప్రభావితం చేస్తున్నారు, ఖర్చు ఎలా పెడుతున్నారని అంచనాకు వస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజుల తర్వాత మరోసారి ఇలా మూడు విడతల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అభ్యర్థుల వ్యయాలను నిశితంగా పరిశీలిస్తారు. దస్త్రాల్లో వ్యత్యాసం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే వివరాలను ఎన్నికల సంఘానికి పంపిస్తారు.


బృందాల నిశిత పరిశీలన

ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలను నియంత్రించేందుకు లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌, వీడియో సర్వేలైన్స్‌, వీడియో వీవింగ్‌, ఎంసీసీ బృందాల ఆధ్వర్యంలో నిఘా పెడతారు. అభ్యర్థుల వెంట షాడో బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభలు, సమావేశాలు, అవసరమైన టెంట్లు, కుర్చీలు, వాహనాలు, ఇతర సామగ్రి, ప్రచార కార్యక్రమాలు ఇలా ప్రతి అంశాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులను వ్యయ బృందాలు మూడుసార్లు తనిఖీలు చేస్తుంటాయి. వాటిలో వ్యత్యాసం ఉంటే నోటీసులు జారీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని