logo

ఓటు... మరింత చేరువ!

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.

Updated : 29 Apr 2024 06:06 IST

పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం, నేరడిగొండ, ఆసిఫాబాద్‌

దిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం కుదిరేది కాదు. ఆయా గ్రామాల ప్రజలు ఓట్లు వేయాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం 200 ఓటర్లు ఉంటే కూడా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇస్తుండటంతో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 2,497 పోలింగ్‌ కేంద్రాలుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 2,852కు చేరుకుంది. అదనంగా 355 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరగనున్న లోకసభ ఎన్నికల్లో మరికొన్ని పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 2,111 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, తాజాగా ఎన్నికల సంఘం 98 కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన పార్లమెంట్‌ పరిధిలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 2,199కి చేరుకుంది. పోలింగ్‌ కేంద్రాలను పెంచి ఓటర్ల సంఖ్యను తగ్గించడంతో గతంలో మాదిరిగా ఓటు వేసేందుకు ఎక్కువ సేపు బారులు తీరాల్సిన అవసరం ఉండదు. ఓటింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఓట్లకు తగ్గట్టుగా..

జిల్లాలో అనేక గ్రామాలు తక్కువ జనాభాతో దూరంగా ఉండటం, వారికి పోలింగ్‌ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఓటు వేసేందుకు ఆసక్తి చూపేవాళ్లు కాదు. పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామాల్లో ఓటు వేసేందుకు బారులు తీరి, గంటల సేపు నిరీక్షించాల్సి వచ్చేది. ఎన్నికల సంఘం ప్రతి ఆవాసంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రతి కేంద్రంలో వేయిలోపు ఓటర్లు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో కేంద్రాల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 16.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 356 కేంద్రాలు ఉండగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 292 కేంద్రాలు ఉన్నాయి. 


ఆదిలాబాద్‌ జిల్లా అల్లికోరిలో ఓటు హక్కు వినియోగంపై ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ దిలీప్‌ ఆధ్వర్యంలో ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న చిత్రమిది. తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు హత్తిగాట్‌లోని పోలింగ్‌ కేంద్రానికి అడవి దారిలో 8 కి.మీ నడిచి ఓటు వేయాల్సి వచ్చేది. అల్లికోరిలో 344 ఓట్లు ఉండటంతో ఇక్కడే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడంతో ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియచేయడంతో పాటు, ఓటు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఇదే మండలంలో మారేగావ్‌లో కూడా కొత్తగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు.


నేరడిగొండ మండలం చించోలిలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం చించోలిలో ఇప్పటి వరకు పోలింగ్‌ కేంద్రం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లఖంపూర్‌లో ఓటు వేశారు. ప్రారంభంలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్టిలో ఓటు వేశారు. తర్వాత తేజాపూర్‌ పంచాయతీ పరిధిలోకి మారడంతో అక్కడికి వెళ్లి ఓట్లు వేశారు. చించోలిలో 195 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా.. నడిచి వెళ్లి ఓటు వేసేవాళ్లు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గ్రామంలోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడంతో ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తొలిసారిగా సొంత గ్రామంలోనే ఓటు వేయనున్నారు. ఇదే మండలంలోని సావర్‌గావ్‌ ఓటర్లు గతంలో నాలుగు కి.మీ దూరంలో ఉన్న పెద్ద బుగ్గారంలో ఓటు వేసేందుకు వెళ్లే వారు. ఈ గ్రామంలో 376 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడే కొత్తగా పోలింగ్‌ కేంద్రం  ఏర్పాటు చేయనున్నారు.


ఆసిఫాబాద్‌ మండలం కొసారలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రం

కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం కొసారలో కొత్తగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. గత శాసనసభ ఎన్నికల వరకు వీళ్లు నాలుగు కి.మీ దూరంలో ఉన్న ఇటిక్యాల పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేసేందుకు వెళ్లేవారు. ఈ గ్రామంలో 200 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా ఇక్కడ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. కుమురం భీం జిల్లా మొత్తంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 597 పోలింగ్‌ కేంద్రాలు ఉండేవి. 200 ఓట్లు ఉన్న గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించడంతో ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ జిల్లాలో అత్యధికంగా 79 పోలింగ్‌ కేంద్రాలకు అనుమతి వచ్చింది.  


సంతోషంగా ఉంది
- జంగు, చించోలి, నేరడిగొండ

ఇన్నేళ్ల తర్వాత తొలిసారి సొంత గ్రామంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. గతంలో ఓటు వేయాలంటే పోలింగ్‌ రోజున అన్ని పనులు మానుకొని ఓటు వేయడానికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు మా ఊళ్లోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో అనుకూలమైన సమయంలో ఓటు వేసి, పనులకు వెళ్లే అవకాశం దక్కింది. నడక బాధ తప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని