logo

పోలింగ్‌ చీటీ.. ఓటరు దిక్సూచీ

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్‌ చీటీలు పంపిణీ చేస్తోంది.

Published : 29 Apr 2024 02:46 IST

బూత్‌స్థాయిలో మొదలైన పంపిణీ ప్రక్రియ

చెన్నూరు 182వ పోలింగ్‌ బూత్‌ ఓటర్‌కు పోల్‌ చీటీలను అందజేస్తున్న బీఎల్వో

చెన్నూరు గ్రామీణం, ఏసీసీ-న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తోంది. ఓటర్లు అందరూ స్వేచ్ఛాయుతంగా ఓటువేసేందుకు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ఓటర్లకు పోలింగ్‌ చీటీలు పంపిణీ చేస్తోంది. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌వోలు పోల్‌ చీటీల పంపిణీని ప్రారంభించారు. బూత్‌ స్థాయి అధికారులు నేరుగా ఓటరు ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. అవసరమైన పోలింగ్‌ సిబ్బంది, అధికారుల నియామకం, పోస్టల్‌ బ్యాలెట్లు, ఈవీఎంల ప్రక్రియ శరవేగంగా చేపడుతున్నారు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల కంటే అత్యధికంగా పోలింగ్‌ శాతం నమోదయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.  పోల్‌ చీటీలలో గతం కంటే భిన్నంగా ఓటర్ల సమగ్ర సమాచారం నిక్షిప్తం చేశారు. అనుమానాల నివృత్తి, ఇతర అవసరాల కోసం బీఎల్‌వో చరవాణి నెంబరును సైతం చీటీలపై ముద్రించారు.

పోలింగ్‌ కేంద్రం చిరునామాను తెలిపే చిత్రం

సమగ్ర సమాచారం..

ఎన్నికలసంఘం ముద్రించిన ఓటరు చీటీలపై ఓటరు పేరు, చిరునామా, నియోజకవర్గం వంటి వివరాలను పొందుపరిచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా చీటీలను ఎన్నికల సంఘం నుంచి పొందారు. వాటిని మండలాలు, పట్టణాలకు తరలించి పంపిణీ చేయిస్తున్నారు. బీఎల్వోలు ఓటర్ల ఇంటికి వెళ్లి చీటీలను అందజేస్తున్నారు. ఓటర్లకు పోల్‌ చీటీలు ఇస్తూ ఓటు వేయాలని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఈ విధానాన్ని గత ఎన్నికల నుంచి అమలు చేస్తున్నారు.

సౌకర్యాలు కల్పించి..

సౌకార్యలు లేని కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. దీన్ని గుర్తించిన అధికారులు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలను మార్చారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం, రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల మార్పు చేశారు. అందులో భవనాలు మార్చినవి 13రాగా పేర్లు మార్చినవి 36 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని