logo

పురిటిలోనే బిడ్డ.. వైద్యం అందక తల్లి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం పెట్రోల్‌బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

Published : 29 Apr 2024 03:05 IST

మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: కాగజ్‌నగర్‌ పట్టణం పెట్రోల్‌బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని బాధిత బంధువులు ఆదివారం రాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌ పట్టణంలోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి సీహెచ్‌.శ్వేత(27)కు మొదటి కాన్పులో పురిటి నొప్పులు అధికంగా రావడంతో ఆదివారం ఉదయం పట్టణంలోని పెట్రోల్‌బంకు ఏరియాలోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. పరీక్షలు చేయగా గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సత్వరమే మృత శిశువును తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా వైద్యులు నిర్లక్ష్యం చేశారు. సాయంత్రం సిజేరియన్‌ చేసి మృతి చెందిన శిశువును తొలగించారు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించగా మెరుగైన వైద్యం నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. కుటుంబీకులు అంబులెన్సులో ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. కాగజ్‌నగర్‌లోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శ్వేత మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువులు ఆ అంబులెన్సులోనే మృతదేహాన్ని ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందున్న రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్వరమే వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. టౌన్‌ ఎస్‌ఐ అంజయ్య ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ముందు జాగ్రత్తగా ఆసుపత్రిని మూసి వేశారు. పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన వినోద్‌తో శ్వేతకు వివాహమైంది. ప్రస్తుతం ఆ దంపతులు కాగజ్‌నగర్‌లోనే నివాసముంటున్నారు. శ్వేత మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని