logo

వంతెనలు లేక.. చింతలు తీరక

వర్షంవస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు.

Updated : 29 Apr 2024 05:53 IST

ఏజెన్సీ వాసులకు ఏటా తప్పని కష్టాలు
న్యూస్‌టుడే, ఇచ్చోడ, ఇంద్రవెల్లి

ర్షంవస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నెలల తరబడి వాగులు దాటాల్సిన దయనీయ పరిస్థితులు. ప్రతి నెల రేషన్‌ తెచ్చుకోవాలన్నా, ఇతర పనులకు వెళ్లాలన్నా నరకమే. ఏటా ఎన్నో గ్రామాలు వేదన పడుతున్నా అధికారులు, పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నా వాటి అభివృద్ధిపై కించిత్తు పట్టింపు లేదు. ప్రత్యేక నిధుల కేటాయింపుల్లో, నిధులు తీసుకురావడంలోనూ అసమర్థత కొనసాగుతోంది. వంతెనలు లేక జిల్లాలోని మారుమూల పల్లెలు పడుతున్న ఇక్కట్లపై కథనం.ఈ వేసవిలో పనులు చేపడితే వారి కష్టాలు గట్టెక్కే అవకాశాలున్నాయి.


వర్షాకాలమంటే వణుకే..  

నెత్తిపై సంచులతో వాగు దాటుతున్న వీరు బజార్‌హత్నూర్‌ మండలం కొత్తపల్లి, గిరిజాయ్‌కు చెందిన గ్రామస్థులు. గ్రామాలకు వెళ్లే మార్గంలో వాగులు ఉండటంతో దాదాపు 4 నెలల పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాగు దాటేందుకు అవస్థలు పడతారు. ముసురు ఉన్న రోజుల్లో వారు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోతారు. అనారోగ్యానికి గురైనా, అత్యవసరంలో వైద్య సేవలు అందించాలన్నా కష్టమే. తమ గ్రామాలకు వంతెనలు నిర్మించాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.


కాలమేదైనా కష్టాలే..

ఇది ఉట్నూరు మండలం వంకతుమ్మ వెళ్లే మార్గంలోని వాగు. రెండు గ్రామాలకు వెళ్లే రహదారిపై ఉన్న ఈ వాగుపై కనీసం లోలెవల్‌ వంతెన కూడా లేక మూడు కాలాల్లోనూ సమస్య తీవ్రంగా మారింది. వాగుదాటే క్రమంలో పలువురు మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి. అత్యవసర సమయంలో వైద్యం అందలేని దయనీయ పరిస్థితి. వైద్యం అందక ఓ గర్భిణి మృత్యువాత పడింది.


వాగు దాటాలంటే నరకమే

ఇంద్రవెల్లి మండలం మామిడిగూడకు వెళ్లే దారిలో ఉన్న వాగును వర్షాకాలంలో దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలోనూ బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టడం లేదు. ప్రజలకు ఈ ఏడాది కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.


ఏళ్లుగా విన్నవిస్తున్నా..  

ఇది ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం హత్తిగుట్ట వెళ్లే మార్గంలో ఉన్న వాగు. వంతెన లేక ఆయా గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా  ఉంటున్నారు. వంతెన నిర్మించాలని ఏళ్లుగా పాలకులకు, అధికారులకు విన్నవిస్తున్నా కనికరించే వారు కరవయ్యారు.


ఈ గ్రామాలకు తిప్పలే  

సిరికొండ మండలం కుంటగూడ వెళ్లే మార్గంలోని వాగు ఇది. చిన్నపాటి వర్షం కురిసినా భారీగా నీరు చేరుతుంది. కుంటగూడ, పాలవాగు వెళ్లేమార్గంలో కనీసం 108 వాహనం వెళ్లే పరిస్థితి ఉండదు. అత్యవసరంగా లోలెవల్‌ వంతెనతో పాటు కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ఈ మండలంలో రాజులగూడ, నారాయణ్‌పూర్‌, భీంపూర్‌, కన్నాపూర్‌తండా గ్రామాలది అదే పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని