logo

భారాసను గెలిపిస్తేనే హామీల అమలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 30 Apr 2024 02:54 IST

కొప్పుల ఈశ్వర్‌కు స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు

తాండూరు, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం తాండూరు మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి నేడు మాట మారుస్తూ.. దేవుళ్లపై ఒట్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో భారాస అమలు చేసిన పథకాలను కూడా సక్రమంగా అమలు చేయకుండా రైతులు, బడుగు బలహీన వర్గాల పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సింగరేణి కార్మిక పక్షపాతిగా, పెద్దపల్లి ప్రాంత ప్రజలకు సుపరిచితుడైన తనను పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు సుమన్‌, చిన్నయ్యలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ వచ్చి కరవును తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌, భాజపాలు ఒక్కటేననే విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలిసిపోయిందన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తామేమీ చేయకున్నా ప్రజలు గుడ్డిగా గెలిపిస్తున్నారని నాయకులు మొద్దువారిపోయే ప్రమాదముందన్నారు. అలా కాకుండా కాంగ్రెస్‌ నాయకుల మెడలు వంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేయాలంటే భారాస అభ్యర్థి ఈశ్వర్‌ను గెలిపించాలని వారు కోరారు. ఎంపీపీ ప్రణయ్‌, జడ్పీటీసీ బానయ్య, భారాస మండల అధ్యక్షులు దత్తుమూర్తి, వైస్‌ ఎంపీపీ నారాయణ, ఎంపీటీసీ శంకర్‌, మాజీ జడ్పీటీసీ సురేష్‌బాబు, దత్తాత్రేయరావు, రాజేశం, రాంచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు