logo

ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు

ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మందిర్‌)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Published : 16 May 2024 03:32 IST

త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు

శిక్షణలో పాల్గొన్న వైద్యాధికారులు

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మందిర్‌)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 144 కేంద్రాల్లో ప్రత్యేక సేవలను అందించటానికి ఆయా కేంద్రాల వైద్యాధికారులకు ఇది వరకే శిక్షణ సైతం అందించారు. ప్రత్యేక వైద్య నిపుణులతో వారందరికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఎన్నికలు పూర్తవటంతో అతి త్వరలో ఆ సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తే బాధితులు సుదూరంలో ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వారికి వ్యయప్రయాసలు తప్పనున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో మూడో వంతు కేంద్రాల్లో అదనంగా ఏడు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో 59 పీహెచ్‌సీలు, 13 యూపీహెచ్‌సీలు, ఎనిమిది బస్తీ దవాఖానాలు, 64 ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో మాతా, శిశు సంరక్షణ, టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నియంత్రణ, సాధారణ వ్యాధులకు చికిత్సలను అందజేస్తున్నారు. నేషనల్‌ ప్రోగ్రాం నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీజెస్‌లో భాగంగా ఇక నుంచి ఉమ్మడి జిల్లాలోని 144 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలను సైతం అందించనున్నారు. ఈ నెల మూడో వారం నుంచి వాటిని అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇది వరకు అందిస్తున్న అయిదు సేవలకు ఇవి అదనం.

ప్రత్యేక సేవలు ఇవే..

ఈఎన్‌టీ, ఆప్తాలమిక్‌, డెంటల్‌, మానసిక, పాలియేటివ్‌కేర్‌, 65 సంవత్సరాల వయసు దాటిన వారికి ఎల్డర్లీ హెల్త్‌ కేర్‌, ఎన్‌సీడీ సేవలు మొదటి విడతలో ఎంపిక చేసిన 33 కేంద్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలపై ఆయా కేంద్రాల వైద్యాధికారులకు అవగాహన లేకపోవటంతో ప్రత్యేక వైద్య నిపుణులతో శిక్షణను పూర్తి చేశారు. ఆ సేవలు ఎలా అందించాలో వారికి ప్రత్యేక వైద్య నిపుణులు రిమ్స్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. రెండో విడతలో కొన్ని, మూడో విడతలో మరికొన్ని కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని వైద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు.

పెద్దాసుపత్రులకు వెళ్లనక్కర లేదు

రాఠోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌ఓ

ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నికల అనంతరం ఏడు రకాల ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇప్పటికే అయిదు రకాల సేవలందిస్తున్నాం. ప్రత్యేక సేవలను కలుపుకొని ఆరోగ్య కేంద్రాల్లో పన్నెండు రకాల సేవలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. బాధితులు సుదూరంలోని పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని