logo

సమస్యలే విస్తరణ

జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది.

Published : 20 May 2024 03:05 IST

హద్దులు గుర్తింపునకే బేల రహదారి పరిమితం

జైనథ్‌ మండలం తర్ణం సమీపంలో రోడ్డు హద్దులు గుర్తించేందుకు పాతిన బండలు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం, బేల : జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే రహదారి ఏమేరకు ఉందనేది ఇటీవల గుర్తించేందుకు ఇటీవల హద్దులు పాతించిన యంత్రాంగం వర్షాకాలం అనంతరమే విస్తరణ పనులు మొదలెట్టేందుకు కసరత్తు చేస్తుండటంతో అప్పటివరకు ప్రజలకు కష్టాలు తప్పేలా లేదు.

తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో బేల రహదారి విస్తరణ పనులు అత్యంత కీలకంగా మారాయి. వరుస ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వంతెనలు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో వాణిజ్యపరమైన వాహనాల సంఖ్య ఇక్కడ ఎక్కువే. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ వైపు వెళ్లే ప్రజలతోపాటు జైనథ్, బేల మండలాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి. ఈ జాతీయ రహదారి నెం.353బీ మొత్తం 32.970 కిలోమీటర్లు విస్తరించి ఉంది.

చిగురించిన ఆశలు

జైనథ్‌ మండలం భోరజ్‌ నుంచి జైనథ్, బేల మండల కేంద్రాల మీదుగా మహారాష్ట్ర సరిహద్దున ఉన్న శంకర్‌గూడ వరకు ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రహదారి విస్తీర్ణం 100 అడుగులు వరకు ఉండగా అందులో 7 మీటర్లు (21 అడుగులు) మాత్రమే బీటీ రోడ్డు విస్తరించి ఉంది. ఈ బీటీకి ఇరువైపులా 1.5 మీటర్ల చొప్పున బీటీని విస్తరిస్తారు. తద్వారా తారు రోడ్డు 10 మీటర్లు (30 అడుగు)లకు పెరగనుంది. అనంతరం ఇరువైపులా మరో మీటరు చొప్పున మొరంతో సైడ్‌ బెర్మ్‌ వేసి చదును చేస్తారు. అయితే రోడ్డు మొత్తం ఏమేరకు ఉందనేది తెలుసుకునేందుకు మూడ్రోజులుగా హద్దు రాళ్లు పాతుతుండటంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఎక్కడ విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అడ్డంకులు ఉన్నాయో గుర్తిస్తున్నారు. రోడ్డు మధ్య నుంచి ఒక వైపు 50 అడుగులు, మరో వైపు 50 అడుగులు కొలతలను బట్టి బండలు పాతారు. దీంతో విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రజలు ఆనందపడినా అధికారులు మాత్రం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.


ఈ విషయమై జాతీయ రహదారుల డీఈ సుభాష్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా టెండర్ల ఆమోదం, డిజైన్‌ గుర్తింపు, ఇతర పనుల కోసం ఇన్ని రోజులు సమయం పట్టింది. త్వరలో వర్షాకాలం రాబోతున్నందున పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదన్నారు. వర్షాలు తగ్గాకే పనులు మొదలవుతాయని వివరించారు.


టెండర్లు పూర్తయినా.. 

ఈ రహదారి కోసం నిర్వహించిన టెండర్లలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ జనవరిలోనే టెండర్‌ దక్కించుకుంది. విశేషమేమిటంటే రూ.360 కోట్లతో చేపట్టే ఈ పనిని రూ.194 కోట్లకే చేస్తామంటూ ముందుకొచ్చింది. ఇదే అందరిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. 46.12 శాతం తక్కువ ధర(లెస్‌)కు కోట్‌ చేసి పనులు చేజిక్కించుకున్న ఈ సంస్థ పనులు మొదలెట్టడంతో తీవ్ర ఆలస్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని