logo

గిరిజన సంక్షేమానికి వైకాపా తూట్లు

గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా  నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

Published : 28 Apr 2024 01:47 IST

రంపచోడవరం, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమానికి 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏలు ఏర్పాటు చేసింది. తద్వారా  నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.  విద్య, వైద్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్వయం ఉపాధిపై ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే చర్యలు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమాన్ని మొత్తంగా గాలికొదిలేసింది. సంక్షేమంతోపాటు వారి హక్కులు సైతం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం స్వయం ఉపాధికి ట్రైకార్‌ పథకం ద్వారా అందజేసిన వాహనాలు, టెంట్‌హౌస్‌ తదితర యూనిట్లను పూర్తిగా నిలిపివేశారు.  గిరిజనుల యువకులకు ఈ నిర్ణయం శాపంగా మారింది. ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.3 పునరుద్ధరణకు అవసరమైన చర్యలు లేవు. ప్రత్యేక నియామకాలు ఊసేలేదు. మొత్తంగా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమంపై నీళ్లు చల్లినట్టయింది.

గిరిజనుల సంక్షేమానికి రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యాలయం

నిర్వీర్యమైన ట్రైకార్‌

గతంలో ట్రైకార్‌ పథకం ద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు వివిధ యూనిట్లను మంజూరు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడంతో స్వయం ఉపాధి దూరమైంది. ఆర్థికంగా గిరిజన యువత ఇబ్బంది పడుతున్నారు. -కంగల శ్రీనివాస్‌, ఆదివాసీ నాయకులు, రంపచోడవరం

జీవో నంబరు 3కి తూట్లు

గత ప్రభుత్వంలో మన్యంలో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేవారు. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం జీవో నంబరు 3  పునరుద్ధరించేందకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. స్థానిక గిరిజనులకు కాకుండా మైదాన, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు.  

కడబాల రాంబాబు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు, రంపచోడవరం

ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యం

ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్లు గడుస్తున్నా నేటికి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీరు, వైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ ప్రాంతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.  

బి.మంగిరెడ్డి, ఆదివాసీ నాయకులు, రంపచోడవరం

గిరిజనుల భవిష్యత్తు అగమ్యగోచరం

ప్రభుత్వం గిరిజనుల హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేయడం వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జీవో నం 3 రద్దవ్వడంతో ఉద్యోగాలు రావడం లేదు. ఎస్టీ జాబితాలో బెంతు ఒరియాలను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని వల్ల ఇంకా పోటీ పెరుగుతుంది. అసలైన గిరిజనుల భవిష్యత్తు నాశనం అవుతుంది.

ముర్ల వెంకటరమణ, గిరిజన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు, చింతపల్లి

పీసా, 1/70 చట్టాల అమలేది?

గిరిజన ప్రాంతంలో పీసా, 1/70 చట్టాలు అమలు చేయడం లేదు. వైకాపా నాయకులకు గనులు, ఖనిజాలు అప్పగించడానికి ఈ చట్టాలను తుంగలో తొక్కారు. ఫలితంగా గనులు తవ్వకాలకు ప్రయత్నాలు జరిగాయి. గిరిజనేతరులు దర్జాగా మన్యంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.

మడపల సోమేష్‌కుమార్‌, మన్యపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు, రింతాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని