logo

ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’

న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు.

Updated : 28 Apr 2024 04:19 IST

గంగవరం పోర్టు కార్మికులతో ఫలించని చర్చలు!
అరకొరగానే ప్లాంటుకు కోకింగ్‌ కోల్‌

ఈనాడు-విశాఖపట్నం: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు. మరో వైపు కార్మికులతో చర్చించి పరిష్కార మార్గాలు కనుక్కోండి అంటూ ‘అదానీ గంగవరం పోర్టు’ యాజమాన్యానికి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆందోళనలో పోర్టులో కార్యకలాపాలు నిలిచి స్టీలు ప్లాంటుకు చెందిన కోకింగ్‌ కోల్‌ సరఫరా ఆగిపోయింది. ఫలితంగా రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నిలిపివేశారు. ముడిసరకు కొరత తీవ్రమవడంతో విశాఖ ఉక్కు మూసివేత దశకు చేరుకుంది. ప్రస్తుతం 700 మంది పోర్టు కార్మికులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు శనివారం సాయంత్రం వరకు కొలిక్కి రాలేదు. పోర్టులో రెగ్యులర్‌ ఉద్యోగులు సైతం జీతభత్యాలపై అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు రకాలు: స్టీలు ప్లాంటులో ఉత్పత్తి ప్రక్రియకు మూడు రకాల కోకింగ్‌ కోల్స్‌ను వాడతారు. హార్డ్‌ కోకింగ్‌ కోల్‌ (30%), సాఫ్ట్‌ కోల్‌ (35%) మిగిలింది మీడియం కోకింగ్‌ కోల్‌. అన్ని కోల్స్‌ అందుబాటులో ఉంటే, అందులో రోజు ఒక రేక్‌ హార్డ్‌ కోకింగ్‌ కోల్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ రకం కోల్‌ ఆస్ట్రేలియా నుంచి నౌకలో వచ్చి గంగవరం పోర్టులోనే నిలిచిపోయింది. ఒక నౌకను విశాఖ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ప్లాంటుకు ముడిసరకు సరఫరా చేస్తున్నారు. అయితే అది సాఫ్ట్‌ కోకింగ్‌ కోల్‌ కావడంతో హార్డ్‌ కోల్‌ కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. మూడు పోర్టుల నుంచి అరకొరగా ముడిసరకు తెప్పించుకుని ఒక్క బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్వహిస్తూ రోజుకు 4వేల టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు.
పోర్టు కార్మికులు సమ్మె చేపట్టి శనివారానికి 19 రోజులు కావస్తున్నా, విశాఖ ఉక్కుకు ఈ నెల 15 నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గత పదమూడు రోజులుగా 1.40లక్షల టన్నుల ఉత్పత్తిని విశాఖ ప్లాంటు కోల్పోయింది. మార్కెట్‌లో టన్ను రూ.60వేలు ఉంది. ఈ లెక్కన సుమారు రూ.840కోట్ల ఉత్పత్తులకు ఆటంకం ఏర్పడింది. దీంతో బయట మార్కెట్‌లో స్టీలు అమ్మకాల్లేక డబ్బులు సమకూరడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని