logo

మన్యాన్ని గంజాయివనంగా మార్చిన జగన్‌

ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Published : 28 Apr 2024 02:06 IST

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

అభ్యర్థి గంగాధరస్వామిని పరిచయం చేస్తున్న షర్మిల

పాడేరు/పట్టణం, అరకులోయ, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. శనివారం ఆమె పాడేరు, అరకులోయల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో గిరిజనులకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 2019లో పాడేరులో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. సామాజిక పింఛన్ల అర్హులకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. అరకు పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న అప్పలనర్స (సీపీఎం), పాడేరు నియోజకవర్గ అభ్యర్థి బుల్లిబాబు (కాంగ్రెస్‌) మాట్లాడుతూ.. తమను గెలిపిస్తే గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అరకులోయ రోడ్‌లో జరిగిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఓటర్లు ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని కోరారు. అరకులోయ ఎమ్మెల్యే దోపిడీదారని ఆరోపించారు. మీ కోసం కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. అరకులోయ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శెట్టి గంగాధరస్వామిని, ఎంపీగా అప్పలనర్సను గెలిపించాలని కోరారు. గిరిజన ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారని గంగాధరస్వామి ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు ఉమామహేశ్వరరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు