logo

జగన్‌కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే

వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు.

Published : 29 Apr 2024 01:33 IST

కశింకోట, న్యూస్‌టుడే: వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. సోమవరం గ్రామంలో ఆదివారం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జిల్ల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకô్, సీఎం.రమేష్‌ సతీమణి శ్రీదేవి తదితరులు మాట్లాడారు.  నాయకులు పొన్నగంటి అప్పారావు, సర్పంచి గొంతిన నాగరత్నం, కాయల మురళీధర్‌, ఉగ్గిన రమణమూర్తి పాల్గొన్నారు.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జగన్‌ గెలిస్తే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వారందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆయనకు ఓటు వేస్తే రాష్ట్రంలో ఆటవిక పాలనను ఆహ్వానించినట్లేనని ఎలమంచిలి తెదేపా ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో పరిధిలో ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన 300 మంది కమిటీతో అచ్యుతాపురంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం, అమాయకులను మోసగించి ఓట్లు వేయించుకోవడం వైకాపా నాయకులకు బాగా తెలుసన్నారు. కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌, సీఎం రాజేశ్‌ మాట్లాడుతూ జగన పాలనలో నచ్చిన వారిని అందలం ఎక్కించి, నచ్చని వారికి పోలీసులతో కొట్టిస్తారని అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శులు రాజాన రమేష్‌కుమార్‌, దూళి రంగనాయకులు, ఆడారి మంజు, దాడి ముసిలినాయుడు, నీరుకొండ నర్సింగరావు, మోటూరు శ్రీవేణి, కర్రి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.  

జగన్‌ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు. కుమారుపురానికి చెందిన వైకాపా నాయకులు ఆదివారం జనసేన గూటికి చేరారు. బైలపూడి రాందాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, మోటూరు శ్రీవేణి, కరెడ్ల ప్రకాశ్‌, ద్వారపురెడ్డి బాబ్జీ, కోరుపోలు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే భయపడి జనంలోకి రాలేకపోతున్నారని ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ అన్నారు. సోమలింగపాలెంలో ఆదివారం రాత్రి సుందరపు విజయ్‌కుమార్‌, ప్రగడ నాగేశ్వరరావు, సీఎం రాజేశ్‌, పప్పల చలపతిరావులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ముందుగా ర్యాలీ నిర్వహించి, ఆలయంలో పూజలు చేశారు.  ఈ గ్రామంలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆపార్టీని వీడి పెద్ద సంఖ్యలో విజయ్‌కుమార్‌ సమక్షంలో జనసేనలో చేరారు. రాత్రి 9 గంటలకు ఏటికొప్పాక చేరుకున్నారు. అక్కడ హస్త కళాకారులను కలిశారు.  నాయకులు కాండ్రకోట చిరంజీవి, అన్నవెంకట్రావు, అన్నం బాబ్జీ, కొలుకులూరి విజయ్‌బాబు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు పాల్గొన్నారు.

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజయ్‌కుమార్‌ భార్య శైలజ కోరారు. ఎలమంచిలిలో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి మహిళలంతా ఇంటింటా తిరిగి బొట్టుపెట్టి ఓటు వేయమని అడిగారు. మహిళల సమస్యలు తెలుసుకున్నారు. చినగొల్లల పాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల్లోనూ ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారన్నారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర నాయకుడు సుందరపు సతీష్‌కుమార్‌, ఆయన భార్య దమయంతి, నాయకులు ఓగిబోయిన చిరంజీవి పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారు

నక్కపల్లి, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే:  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత విమర్శించారు. సారిపల్లిపాలెం వద్ద పార్టీకి చెందిన వివిధ విభాగాల యువతతో ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈదటం, ఎస్‌.నర్సాపురం, పీఎల్‌పురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెదేపా పాలనలో అరకొరగా డ్రగ్స్‌ పట్టుబడినా కఠిన చర్యలు తీసుకోవడంతో వాటి కోసం మాట్లాడటానికి కూడా భయపడేవారన్నారు. వైకాపా పాలనతో ఇవి విచ్చలవిడిగా దొరుతున్నాయని ఆరోపించారు. జగన్‌ పాలనలో  ప్రధానంగా ఆడపిల్లలు, మహిళలు బయటకు వస్తే రక్షణ కరవైందన్నారు.  తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం రామకృష్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు చించలపు పద్దు, ఐ టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు భీమరశెట్టి శ్రీనివాస్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్డి పండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కమలం గుర్తు, తనకు సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపునకు బుల్లి తెర నటులతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌, జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు ఓటువేయాలని బుల్లి తెర నటులు నాయుడు, సురేష్‌, సాగర్‌ ఆదివారం అనకాపల్లిలో ప్రచారం చేశారు. వీరిని సీఎం రమేశ్‌, కొణతాల రామకృష్ణ, బుద్ధ నాగజగదీశ్వరరావు సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని