logo

అవ్వా తాతలకు అప్పుడే ధీమా

తెదేపా హయాంలో తెలుపు రేషన్‌ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు.

Updated : 29 Apr 2024 05:17 IST

 తెదేపా హయాంలో సజావుగా పింఛన్ల పంపిణీ
 ఇప్పుడు ఏ నెల అందుకోకున్నా సొమ్ము పోయినట్లే
 ఈనాడు, పాడేరు

 నాడు..

తెదేపా హయాంలో తెలుపు రేషన్‌ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. పింఛన్‌దారులు ఏదైనా కారణంతో ఒకటి, రెండు నెలలు వరుసగా డబ్బులు తీసుకోలేకపోతే మూడు నెలల మొత్తం సొమ్ము కలిపి ఇచ్చేవారు. జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు రెండు నెలలకు ఒకసారి స్వగ్రామానికి వచ్చి పింఛన్లు తీసుకునేవారు. ఒక నెల అందకుంటే తర్వాతైనా అందుతుందనే ధీమా అవ్వాతాతల్లో ఉండేది.

నేడు..

వైకాపా ప్రభుత్వంలో పింఛనుదారులు నిత్యం టెన్షన్‌ పడాల్సి వస్తోంది. ఒకసారి పింఛను ఇస్తున్నారు కదా.. బతికున్నంత కాలం సాయం అందుతుంది అనుకుంటే పొరపాటే. ఆరంచెల పరిశీలన (సిక్స్‌ స్టెప్స్‌ వెరిఫికేషన్‌)లో ఎప్పుడైనా వాటిని తొలగించేస్తున్నారు. ఏదైనా కారణంతో ఒక నెల పింఛను సొమ్ము అందుకోలేకపోతే ఆ నెల డబ్బులు హుష్‌కాకే. ఈ భయంతోనే లబ్ధిదారులు దూర ప్రాంతాల్లో పనులకు వెళ్లలేకపోతున్నారు. వెళ్లినవారు నెలనెలా పింఛన్ల కోసం వచ్చి అందులో రూ. వెయ్యి వరకు రవాణా ఛార్జీలకే ఖర్చుచేయాల్సి వస్తోంది. 

పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు వైకాపా సర్కారు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. మొదట్లో కొత్త పింఛన్లు కోసం ప్రతినెలా వచ్చే దరఖాస్తుల్లో అర్హులైన వారికి తర్వాతి నెలలోనే మంజూరు చేస్తామని ప్రకటించింది. తర్వాత కొద్ది రోజులకే, ‘అబ్బే.. నెలనెలా కొత్తవి మంజూరు చేయలేం.. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఇస్తా’మన్నారు. వాటికి ఆరు దశల ఆంక్షలు పెట్టారు. అయిదెకరాలు పైబడి భూములుండకూడదు. 300 యూనిట్ల మించి కరెంటు వినియోగించకూడదు. ఇల్లు పెద్దగా ఉండకూడదు. ఇంట్లో ఎవరూ నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు.. ఆదాయ పన్ను చెల్లించకూడదనే కారణాలను చూపించారు. ఓ చేత్తో కొత్త పింఛన్లు ఇస్తూ, మరో చేత్తో పాతవి తొలగిస్తున్నారు.

బదిలీకి నిరీక్షణే.. గతంలో వృద్ధాప్య పింఛను అందుకునే పురుషులు ఎవరైనా చనిపోతే వారి భార్యకు ఒకట్రెండు నెలల్లో వితంతు పింఛను మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించేవారు. ఈ ప్రభుత్వంలో పింఛను బదిలీ వెంటనే చేయడం లేదు. పింఛను అందుకునే భర్త చనిపోతే ఆరు నెలల వరకు భార్యకు వితంతు పంఛను మంజూరు చేయడం లేదు. నాతవరం మండలం బెన్నంపూడిలో కలగా రాజు అనే మహిళ తన భర్తకు పింఛను వచ్చేది చనిపోయారు. ‘ఆయన స్థానంలో నాకో పింఛను మంజూరు చేయండి బాబూ!’ అంటూ మూడు నెలలుగా సచివాలయం చుట్టూ తిరుగుతోంది. ఆమెలానే జిల్లాలో చాలామంది కొత్త పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఒకసారి నిలిపేస్తే ఆరు నెలలు ఆగాల్సిందే.. నక్కపల్లి మండలం పెదతీనార్లకు చెందిన నూకమ్మకు ఇస్తున్న పింఛను ఒకసారి నిలిపేశారు. ఎందుకు ఆపేశారని వెళ్లి అడిగితే నీ భర్త పేరు కోటా కార్డులో కనిపిస్తోంది. అది తొలగిస్తేనే పింఛను వస్తుందని చెప్పారు. ‘కార్డులో పేరున్నా డీలరు బియ్యం ఇవ్వడం లేదు కదా?’ అని అడిగితే సాంకేతికంగా సమస్య వస్తుందని సర్దిచెప్పి పంపేశారు. కార్డులో పేరు తొలగించుకుని ఆరు నెలలు గడిచిన తర్వాతే పింఛను పునరుద్ధరించారు. పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన సూర్యకాôతానికి వితంతు పింఛను అందుతోంది. ఈమె ఆధార్‌ కార్డు నంబర్‌ వేరే జిల్లాలోని బియ్యం కార్డుకు అనుసంధానమైంది. దీంతో ఈమెకు పింఛను నిలిపేశారు. దాన్ని పునరుద్ధరించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. తెదేపా హయాంలో పింఛను ఒకనెల ఆగితే, మరుసటి నెలలోనే పునరుద్ధరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని