logo

రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి

‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం.

Published : 20 Apr 2024 08:11 IST

రహస్య సమావేశాలు పెట్టి మరీ వేధింపులు

ఈనాడు, అమరావతి : ‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. ఓట్లు వేయించకపోతే మీరు ఉండి వృథా. రాజీనామా చేసిన వాళ్లకు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.10 వేలు ముందే ఇస్తాం. చేయకపోతే మళ్లీ రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఊరుకునేది లేదు. మా కోసం పనిచేసిన వాళ్లను మాత్రమే ఉంచుతాం.’.. అంటూ గుడివాడ, విజయవాడ తూర్పు, మధ్య, పెనమలూరు నియోజకవర్గాల్లో వాలంటీర్లను వైకాపా అభ్యర్థులు, వారి అనుచరులు బెదిరిస్తున్నట్లు తెలిసింది.

తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తొలగించబోమని, రూ.10 వేల వేతనం ఇస్తామంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించడంతో ప్రస్తుతం వైకాపా నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు ప్రకటనతో అత్యధిక శాతం వాలంటీర్లలో ఆశలు చిగురించాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 22,400 మంది వాలంటీర్లున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 1,500 మంది వరకు ఉన్నారు. కృష్ణాలో 12 వేలు, ఎన్టీఆర్‌లో 10,400 మంది ఉండగా.. ఇప్పటివరకూ రెండు జిల్లాల్లో కలిపినా కనీసం రెండు వేల మంది కూడా రాజీనామాలు చేయలేదు. కృష్ణాలో 1,155 మంది రాజీనామాలివ్వగా.. వారిలో వెయ్యి మంది వరకూ మచిలీపట్నంలోనే చేశారు. ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు కృష్ణమూర్తి బలవంతం చేయడంతో వీళ్లంతా ఒకేసారి రాజీనామాలు చేసి ప్రస్తుతం బాధపడుతున్నారని తెలిసింది.

కొందరు నాయకులకు ఇదే పని..

వాలంటీర్లను రాజీనామాలు చేయించాలంటూ.. కొందరు వైకాపా నాయకులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. గుడివాడలో కొడాలి నాని కీలక అనుచరుడైన నియోజకవర్గస్థాయి నాయకుడికి బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. దీంతో ఆయన నిత్యం వాలంటీర్ల ఇళ్లకు వెళ్లి మరీ రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీంతో మాకు ఇదేం తలనొప్పులంటూ.. పలువురు వాలంటీర్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు మాత్రం చేసేది లేదంటూ.. తేల్చి చెబుతున్నారు. గుడివాడలో ఇప్పటివరకూ 74 మంది మాత్రమే వైకాపా నేతల బలవంతం మీద రాజీనామాలు చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమలోనూ ఇలాగే కొంతమంది నేతలకు ప్రత్యేకంగా బాధ్యత అప్పగించి రాజీనామాలు చేయించాలంటూ వైకాపా అభ్యర్థులు సూచించినట్టు తెలిసింది.

సహకరించకుంటే ఇబ్బందులే..

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ ఆదేశాలతో ఆయన కీలక అనుచరుడైన ఓ చోటా వైకాపా నాయకుడి ఆధ్వర్యంలో వాలంటీర్లతో గురువారం రహస్యంగా సమావేశం నిర్వహించారు. రాణిగారితోట ప్రాంతంలోని 17వ డివిజన్‌ పరిధి బాపనయ్యనగర్‌లో ఓ పాఠశాలకు సమీపంలో ఈ సమావేశం జరిగింది. వాలంటీర్లను అక్కడికి రప్పించి.. వారితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో అందరూ రాజీనామాలు చేసి.. దేవినేని అవినాష్‌ గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చేసేవాళ్లకి రూ.10వేలు ఇస్తామని, చేయని వారికి తమ ప్రభుత్వం మళ్లీ వస్తే.. ఇబ్బందులు తప్పవంటూ ఆ నాయకుడు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. రాజీనామా చేస్తామని అంగీకరించి సంతకాలు చేసిన వాళ్లకు విందు భోజనాలు సైతం పెట్టి పంపించినట్టు తెలుస్తోంది. ఇలాగే.. అన్ని నియోజకవర్గాల్లోనూ వాలంటీర్లతో రహస్య సమావేశాలు పెట్టి, వారితో రాజీనామా చేయించి.. బలవంతంగా తమ కోసం ప్రచారం చేయించుకోవాలని.. వైకాపా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిలదీతలు పెరిగిపోవడంతో..

వాలంటీర్లకు ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో రోజూ ఫోన్లు చేసి.. రాజీనామా చేయాలంటూ వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపా అభ్యర్థుల తరఫున ఇంటింటికీ ప్రచారం చేసేవాళ్లు కరవయ్యారు. విజయవాడ మధ్య, తూర్పు, పశ్చిమ, గుడివాడ, పెనమలూరుల్లో.. అభ్యర్థులు ప్రచారంలో వెనుకపడ్డారు. దీంతో నిత్యం డబ్బులిచ్చి.. కొంతమందిని జెండాలు పట్టుకొని తమ వెనుక తిప్పుతున్నారు. వైకాపా చోటా నాయకుల హడావుడి ఎక్కువైపోయింది. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తుండడంతో.. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా మంచినీళ్లు, ఇళ్లు, పట్టాలు, విద్యుత్తు సమస్యలు, రహదారులు.. ఇలా సమస్యలతో నిలదీస్తున్నారు. అందుకే వాలంటీర్లు తమ వెంట ఉంటే.. ముందుగానే ప్రచారానికి ఎటువెళ్లాలి, ఎటు వెళ్లకూడదు.. అనే సమాచారం ఇవ్వడంతో పాటు, పింఛనుదారులను ప్రభావితం చేయగలరని వైకాపా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే.. వారితో బలవంతంగా రాజీనామా చేసైనా తమతో పాటు ఈ 20 రోజులు ప్రచారంలో తిప్పుకోవాలని.. గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. వీళ్లు ఎంత బలవంతం చేస్తున్నా.. వాలంటీర్లు మాత్రం రాజీనామాలు చేసేందుకు అంగీకరించకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు