logo

పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు

అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 06:04 IST

రెండ్రోజుల్లో నీ అరాచకాలు బయటపెడతాం: కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ

మాట్లాడుతున్న కూటమి నాయకులు 

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. బందరు కోటలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు బండి రామకృష్ణ పేర్నినాని తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొల్లు మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రజాగళం సభకు లభించిన అపూర్వ ఆదరణ చూసి మతిస్థిమితం కోల్పోయిన పేర్ని నాని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. రెండు రోజుల్లో పేర్నికి సంబంధించిన అక్రమాల చిట్టాను మొత్తం ప్రజల ముందు పెడతామనీ, కొడుకు కిట్టూను రాజకీయంగా ప్రమోట్‌ చేసుకునేందుకు అసత్యాలు చెప్పడం మానుకోవాలన్నారు.

భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడలేదా..?

బందరు పోర్టు గోగిలేరు తరలించేందుకు సంతకం చేసిన పేర్ని పెదపట్నంలోనే పోర్టు వస్తుందని ప్రచారం చేశారని, 2014లో పోర్టు కట్టలేకపోతే ముక్కు నేలకు రాసుకుంటానంటూ ప్రగల్భాలు పలికారని.. ఈ విషయాలు ప్రజలు మర్చిపోలేదన్నారు. చివరకు తెదేపా ప్రభుత్వ చొరవతో ఏర్పాటైన వైద్యకళాశాల భూముల కొనుగోలు విషయంలో రూ.8కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కాగ్‌ స్పష్టం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని గంజాయికి కేంద్రంగా మార్చి గంజాయి బ్యాచ్‌లో దాడులు చేయించే విష సంస్కృతికి తెరతీశారంటూ విమర్శించారు. చేయని నేరానికి తనను 54 రోజులు జైల్లో పెట్టించడమే కాకుండా ఐదేళ్లలో ఎన్నో అక్రమ కేసులు పెట్టించినందుకు తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ పేర్ని తన నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం గురివింద సామెతను గుర్తుచేస్తోందన్నారు. ఏమీ చెయ్యకుండానే గోదాములు, బినామీపేర్లతో భూములు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. బందరు పోర్టు, వైద్యకళాశాల ఎంపీ బాలశౌరి చొరవతో వస్తే తనవల్లనే అని చెప్పుకోవడం పేర్నికే చెల్లిందన్నారు. సొంత సామాజిక వర్గంలో ఏఒక్కరూ రాజకీయంగా ఎదగకూడదన్న అసూయతో ఎంపీలుగా ఉన్న బాడిగ రామకృష్ణ, వల్లభనేని బాలశౌరిలను అవమానించిన విషయం వాస్తవమో కాదో చెప్పాలన్నారు. మాదివాడ రాము మాట్లాడుతూ కరోనా సమయంలో పేర్ని కిట్టూ చేసిన సేవల గురించి పదే పదే చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా కిట్టూ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారం రోగులతో తిరిగి పలువురి మృతికి కారణమయ్యాడన్నారు. ఆస్పత్రి వైద్యులే కిట్టూ ప్రవర్తనను తప్పుపట్టిన విషయానికి తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. తెదేపా, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు