logo

అంతా మోసం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జులై 2023 నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ కాగితాలకే పరిమితమైంది. ఐఆర్‌ (మధ్యంతర భృతి) గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.

Updated : 22 Apr 2024 06:12 IST

పీఆర్సీ, ఐఆర్‌పై పెదవి విప్పని వైకాపా ప్రభుత్వం
అసంతృప్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
న్యూస్‌టుడే, కూచిపూడి, గుడ్లవల్లేరు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జులై 2023 నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ కాగితాలకే పరిమితమైంది. ఐఆర్‌ (మధ్యంతర భృతి) గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయం రావడంతో ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలతోపాటు ఐఆర్‌పైనా నిర్ణయం ప్రకటిస్తుందని సంఘాలు ఎదురు చూశాయి. 12వ పీఆర్సీ(వేతన సవరణ సంఘం)కి సంబంధించి కమిషన్‌ను నియమించినా పని చేయడానికి సిబ్బంది, కార్యాలయం వంటివి ఇవ్వలేదు. 30 శాతం ఐఆర్‌తోపాటు కొత్తగా రెండు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఐఆర్‌ ప్రకటిస్తారని ఆశించారు. పన్నెండో పీఆర్సీ ఏర్పడకపోవడం, కనీసం ఐఆర్‌పైనా నిర్ణయం వెలువడకపోవడంతో ఉద్యోగులు, పింఛనుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


ఉద్యోగుల గోడు పట్టించుకోలేదు

- ఓ ఉపాధ్యాయిని

ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వారిగోడు పట్టనట్లు వ్యహరించింది. డీఏలు కూడా అరకొరగానే మంజూరు చేసింది. బకాయిలు ఖాతాలకు జమ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోంది. 


ఐఆర్‌కు మంగళం పాడింది

- ఒక ఉద్యోగి

ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. అధికారం మేనెల వరకే ఉంటే జులైలో ఒకే సారి పీఆర్సీ ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. పెండింగ్‌     బకాయిలపై మాట్లాడడం లేదు.  


ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర నిరాశ

- యూటీఎఫ్‌ ప్రతినిధి

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 నెలలు ఆలస్యంగా రివర్స్‌ పీఆర్‌సీని ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. ఐఆర్‌ కంటే ఫిట్మెంట్‌ 4 శాతం తగ్గించడం దేశంలో ఎక్కడా జరగలేదు. దీని వల్ల సగటు ఉద్యోగికి తన సర్వీస్‌ కాలంలో 2-3 ఇంక్రిమెంట్లు నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదు.


ప్రభుత్వ తీరు సరికాదు

- ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు

ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బకాయిలు రాలేదు. ఎప్పుడిస్తారో తెలీదు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏలో మొదటి రెండు డీఏలు సీపీఎస్‌ వారికి రాలేదు. మిగిలిన ఐదు డీఏలను పీఆర్సీలో కలిపి వేశామని ప్రభుత్వం చెబుతోంది. పీఆర్సీ ఇచ్చిన తరువాత కూడా మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని