logo

కరోనాలోనూ కనికరించలె..

కొవిడ్‌ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్‌గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Published : 28 Apr 2024 04:01 IST

మద్యం దుకాణాల వద్ద నియమించడంపై గురువుల మండిపాటు
న్యూస్‌టుడే, కూచిపూడి

కొవిడ్‌ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పోలీసులు, హోమ్‌గార్డులకు సహాయకులుగా పెట్టి విధులు నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైన్‌ షాపుల వద్ద జనం గుమిగూడకుండా, భౌతికదూరం పాటించే గురుతర బాధ్యతను గురువుల నెత్తిన పెట్టింది. నమస్కారం పెట్టించుకోవాల్సిన గురువులే తాగుబోతులకు చేతులు జోడించి మరీ కరోనా నియమాలు పాటిస్తూ మద్యం తాగాలని వేడుకునేలా చేసింది. సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. దీంతో వైకాపా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం నేరం. నాడు - నేడు తొలి విడత కార్యక్రమాన్ని కరోనా సమయంలో ఆపొద్దని, లాక్‌డౌన్‌లో కూడా టార్గెట్‌ పూర్తి చేయాలనడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. సిమెంట్‌, ఐరన్‌ దుకాణాలకు వెళ్లి సామగ్రి కొనుగోలు చేసి మరమ్మతులు చేయించే క్రమంలో అనేక మందికి కరోనా సోకింది.

ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం

ఉపాధ్యాయులు కొవిడ్‌ కాలంలో 50 శాతం జీతం మాత్రమే తీసుకున్నారు. వారేమీ ఫ్రంట్లైన్‌ వారియర్స్‌ కాకపోయినప్పటికీ ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాల్లో, కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోగులను వరుస క్రమంలో పంపడానికి, రైతుబజార్ల దగ్గర, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద, చెక్‌పోస్టుల దగ్గర విధులు కేటాయించింది. ఉపాధ్యాయులకు సక్రమంగా మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వకుండా డ్యూటీలు చేయించడంతో అనేక మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు.


చరవాణి వాడితే క్రమశిక్షణ చర్యలు

- ఒక ఉపాధ్యాయుడు

జగనన్న విద్యా దీవెన(జేవీకే) కిట్ల పంపిణీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తల్లి, తండ్రి వేలిముద్రలు వేయాలి. పాఠ్య, రాత పుస్తకాలు, సాక్సులు, బూట్లు వంటివి అన్ని అప్‌లోడ్‌ చేయాలి. ఉపాధ్యాయుడు పాఠశాలలో చరవాణి వినియోగిస్తే విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు వేయడం సరికాదు. ఇష్టం లేకుండానే విధులకు వెళ్లాము.


మద్యం దుకాణాల వద్ద విధులేంటి?

- ఉపాధ్యాయిని

గురువులకు మద్యం దుకాణాల వద్ద విధులు వేయడం సరికాదు. వేలాది మంది పోలీసులకు, వైద్య సిబ్బందిని తయారు చేసేది ఉపాధ్యాయులే. రాష్ట్రానికి మంచి చేస్తున్నామా.. చెడుచేస్తున్నామా అని ఆలోచించే నాయకుడు లేకపొవడం దురదృష్టకరం.


ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసింది

- యూనియన్‌ నాయకుడు

ప్రభుత్వం ఒక ఐఏఎస్‌ అధికారిని అడ్డం పెట్టుకొని ఉపాధ్యాయుల ఉద్యమాలను అణచివేసింది. వారు ఏమి కోల్పోతున్నారో అర్థంకాని పరిస్థితులు సృష్టించింది. రాష్ట్రస్థాయి సంఘ నాయకులు కూడా తరగతి గదులకు పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్యం మానండి అని చెప్పాల్సిన ఉపాధ్యాయులు తాగుబోతులను క్రమశిక్షణతో తాగండి అని బోధించాల్సిన దుస్థితికి జగన్‌ తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు