logo

ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!

‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్‌ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు.

Published : 28 Apr 2024 04:10 IST

స్థానిక నేతలను నమ్మని వైకాపా
నియోజకవర్గాలకు కొత్త వ్యక్తులు
ఆర్థిక వ్యవహారాలూ వారికే
ఈనాడు, అమరావతి

‘అన్నా.. మనవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్ను అడగలేకపోతున్నారు.. వారి రోజు వారీ ఖర్చులు ఉంటాయి కదా..! వారే కాదు.. కార్పొరేటర్లూ అడుగుతున్నారు.’

- విజయవాడ నగరంలో వైకాపా అభ్యర్థిని ముఖ్య అనుచరుడి అభ్యర్థన

‘అంతా మనవాళ్లు చూసుకుంటారు. మన వాళ్లు వచ్చారు. వారికి బస ఏర్పాట్లు చెయ్‌. ఎవరికి ఎంత.. ఎక్కడెక్కడనేది వారే చూసుకుంటారు..!’

- ఇదీ అభ్యర్థి సమాధానం.

‘‘ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్‌ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. సంచులు వేసుకుని గ్రామాల బాట పట్టారు. అభ్యర్థులపై నమ్మకం లేని వైకాపా అధిష్ఠానం తన సొంత కార్యకర్తలను రంగంలోకి దింపింది. ఇప్పటికే మైలవరంలో అనుమానాస్పద స్థితిలో కొత్త వ్యక్తులు తిరుగుతుంటే స్థానికులు ప్రశ్నించారు. కడప, నెల్లూరు నుంచి 70 మంది వచ్చి ఓ భవనంలో అద్దెకు దిగినట్లు తెలిసింది. మైలవరంలో మూతపడిన సూపర్‌ మార్కెట్‌లో బస చేశారు. విజయవాడ నగరంలోనూ అదే తీరు.’’
ఎన్టీఆర్‌ జిల్లాలో మైలవరం, తిరువూరు, విజయవాడ పశ్చిమ పరిధిలో బయట నుంచి కార్యకర్తలను దించారు. కృష్ణా జిల్లాలో పెడన, అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం, పామర్రులకు కొత్త వ్యక్తులు చేరారు. ప్రతి చోట 100-200 మందిని దించారు. వీరు ఆయా గ్రామాల్లో ముఖ్య నాయకులను వెంట పెట్టుకుని ఖర్చుల వ్యవహారం చూస్తున్నారని తెలిసింది. కనీసం ఖర్చులు భరించలేని అభ్యర్థులు ఉన్న చోట ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. శిక్షణ ఇచ్చి.. నెల వేతనం హామీ మీద యువకులనే పంపారు.

గ్రామస్థాయిలో పావులు...

వైకాపాలో కొందరు గ్రామ స్థాయి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. గ్రామాల్లో పనులు చేసినా బిల్లులు రాక అప్పులపాలయ్యారు.  వారిని గుర్తించి తృప్తి పరిచేందుకు పార్టీ కీలక వ్యక్తులను రంగంలోకి దింపింది. ద్వితీయ శ్రేణి, గ్రామస్థాయి క్యాడర్‌ అసంతృప్తితో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే కొందరు పార్టీలు మారారు. మరికొందరు మౌనంగా ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు చేయడం లేదు. ప్రచార సభలకూ ముందుకు రావడం లేదు. వీరికి ప్రచార ఖర్చుల కింద నేరుగా ఈ బృందాలు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు.

చక్కబెడుతున్నారిలా...

  • మైలవరం అభ్యర్థి.. సర్నాల తిరుపతిరావుకు సొంత ఇల్లు కూడా లేదు. ఒక వాహనం పార్టీనే సమకూర్చింది. అన్ని వ్యయాలు పార్టీ పరిశీలకులకు అప్పగించి కొందరు ప్రముఖులపై భారం మోపింది. వారిని విశ్వసించలేక ఇతర జిల్లాల నుంచి 70 మందిని రంగంలోకి దించింది. ఈ వ్యవహారం ఇటీవల వెలుగు చూడగా తెదేపా అభ్యర్థి సైతం ఆరోపణలు చేశారు. పోలీసులకూ సమాచారం వెళ్లింది.
  • పశ్చిమలో ఆసిఫ్‌ మైనార్టీ ఓట్లను వైకాపా నమ్ముకున్నా.. ఇతర నాయకులు అలక వహించారు. కొందరు వెలంపల్లి వెంట సెంట్రల్‌ వెళ్లారు. దీంతో ఇక్కడ కూడా బయట ప్రాంతాల నుంచి రంగంలోకి దించారు.
  • పెడనలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ హారిక భర్త రాముకు టికెట్‌ ఇచ్చారు. అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారని కొత్త వారిని రంగంలోకి దించారు.
  • పెనమలూరులో మంత్రి జోగి... కొందరితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకుని అసంతృప్తులను బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు.
  • గన్నవరంలోనూ ఇదే రీతిన ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏర్పాట్లు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

సొంతవారికే బాధ్యత!

విజయవాడ సెంట్రల్‌లో వలస వచ్చి పోటీ చేస్తున్న వెలంపల్లి ఆర్థిక లావాదేవీలను తన బంధువులకు, సొంత సామాజిక వర్గం వ్యక్తులకు అప్పగించారు. ఈ విషయమై వైకాపా నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సెంట్రల్‌కు వచ్చిన మొదట్లో కార్పొరేటర్లను కలసి మద్దతు కోరినప్పుడు.. వారి డిమాండ్లను తీర్చేందుకు అంగీకరించిన వెలంపల్లి ఇప్పుడు తన సొంత వారికి అన్నీ అప్పగించడంతో వారు కినుక వహించారు. అల్పాహార ఖర్చులు సైతం ఎవరినో అడగాల్సి వస్తోందని వాపోతున్నారు. డివిజన్లలో తమకు విలువ లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. ఇంతకాలం మల్లాదితో ఉండి ప్రస్తుతం వెలంపల్లికి మద్దతు ఇస్తుంటే తగిన శాస్తే చేశారని వాపోతున్నారు.

  • తూర్పులోనూ అభ్యర్థి కుటుంబ సభ్యులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • గుడివాడ, గన్నవరం, పామర్రు, అవనిగడ్డ, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటల్లోనూ ద్వితీయ, తృతీయ నాయకులను అభ్యర్థులు బుజ్జగించే పనిలో ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు