logo

వైకాపా కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమా?

దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు.

Published : 28 Apr 2024 04:12 IST

మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం ఎకరం స్థలంలో ఉంది.. బందరులో మాత్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో వైకాపా కార్యాలయాన్ని కోటలా కట్టేస్తున్నారు అంత అవసరమా అని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. నాయకులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. శనివారం సాయంత్రం నగరంలోని ఓ వేడుకమందిరంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతిసారి పట్టాభి భవనం గురించి చర్చించడానికి మనకే ఇబ్బందికరంగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టాభి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.బ్రాహ్మణులకు అండగా ఉంటామని, వారు సామాజిక భవనం అడిగారని, దాని నిర్మాణానికి కూడా కృషి చేస్తానని తెలిపారు.

పదవులు తాత్కాలికమే

మంచి పనులు చేస్తారని రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారని అలా కాకుండా తన వద్ద అధికారం ఉంది..పోలీసు వ్యవస్థ ఉంది...రెవెన్యూ యంత్రాంగం ఉంది..నేను చెప్పిందే నడవాలి అనడం మూర్ఖుడు చేసే పని అన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలం ఇచ్చింది...యూనియన్‌ బ్యాంకు అధికారులు డబ్బులు ఇస్తామన్నారు ..దానిని అడ్డుకున్నారంటే వారికి ఏం ప్రయోజనమో తెలియడం లేదన్నారు. తానేదో పైనుంచి దిగివచ్చాను...తాను చెప్పిందే జరగాలి, వేరేవాళ్లు చేస్తే జరగకూడదనుకోవడం తప్పని.  పదవులు తాత్కాలికమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ పరోక్షంగా ఎమ్మెల్యే పేర్నిని ఉద్దేశించి విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య మాట్లాడుతూ వివిధ హామీలతో మోసం చేసేందుకు వైకాపా నాయకులు వస్తున్నారని అందరూ ఐక్యంగా ఉంటూ దిమ్మతిరిగేలా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా బ్రాహ్మణ సాధికారత జిల్లా కన్వీనర్‌ పీవీ ఫణికుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెదేపా, భాజపాలతోపాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు దూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నాగలింగం అయోధ్యరామయ్య, గూడూరి వెంకట హనుమంతరావు, నందనవనం వెంకట కృష్ణారావు, వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్‌, లొల్లా కుటుంబశాస్త్రి, వీఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ, న్యాయవాదులు వింజమూరి శివరామ్‌, సర్వా లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలశౌరి, ఆనందసూర్యలను గజమాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని