logo

బస్సులు డొక్కు.. డబ్బులు నొక్కు..!

పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్‌.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్‌ మీద షాక్‌లిచ్చారు.

Updated : 28 Apr 2024 06:00 IST

జనంపై జగన్‌ ఛార్జీల కొరడా
నష్టాల పేరుతో ఓసారి, డీజిల్‌ సెస్సు అంటూ రెండు దఫాలు
ఈనాడు, అమరావతి

పేదలకు మేలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతూ వచ్చిన సీఎం జగన్‌.. చేతల్లో వారిపై దెబ్బమీద దెబ్బ కొడుతూ వచ్చారు. సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీల రూపంలో మోయలేని భారాన్ని మోపారు. ఇష్టారీతిన పెంచేసి షాక్‌ మీద షాక్‌లిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెంచేసిన జగన్‌ సర్కారు.. ఆ తరువాత కొవిడ్‌ ఉద్ధృతి నుంచి జనం కోలుకుంటుండగానే మరో దెబ్బ కొట్టింది. వెనువెంటనే రెండుసార్లు ఛార్జీలను పెంచేసింది. అసలే ధరల మంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు ఈ భారాన్ని తట్టుకోలేకపోయారు. ప్రయాణించే దూరం పెరిగే కొద్దీ ఛార్జీలు ఎక్కువయ్యాయి. ఫలితంగా దూరప్రాంత సర్వీసుల్లో ప్రయాణమంటేనే జనం భయపడిపోయే పరిస్థితి.


ది కిలోమీటర్లలోపు ప్రయాణాన్ని మినహాయించి... రెండు స్టేజీలు దాటిన తర్వాత రూ. 5 పెంచారు. 75 కిలోమీటర్ల వరకు ఇదే పెంపు వర్తింపజేశారు. ఇంద్ర, గరుడ, అమరావతి సర్వీసులకు కిలోమీటరుకు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచారు.


రెండు జిల్లాల్లో ఏటా రూ. 372 కోట్ల మేర వడ్డన

డీజిల్‌ సెస్సు పేరుతో జగన్‌ సర్కారు ఛార్జీలు పెంచింది. గతానికి భిన్నంగా కిలోమీటరు ప్రాతిపదికన కాకుండా టిక్కెట్‌పై బస్సును బట్టి రూ. 5 నుంచి రూ. 15 వరకు పెంచారు. అధికారులు చెప్పిందొకటి.. పెంచింది మరోలా. అప్పటివరకు పల్లెవెలుగు బస్సులపై ఏ రకమైన సెస్సూ లేదు. కొత్తగా డీజిల్‌ సెస్సు పేరుతో పాటు ప్యాసింజర్‌, భద్రత సెస్సులను కూడా మోపారు.


ఛార్జీలను పెంచిన రెండున్నర నెలలకే డీజిల్‌ సెస్సు పేరుతో మళ్లీ జనంపై పిడుగు పడింది.. సర్వీసునుబట్టి ధరలను నిర్ణయించింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులకు రూ. 10, ఎక్స్‌ప్రెస్‌లకు రూ. 20, ఆల్ట్రా డీలక్స్‌లకు రూ. 25, సూపర్‌ లగ్జరీలకు రూ. 40గా కనీస ఛార్జీలను సవరించింది. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులకు కలిపే కనీస ధరను నిర్ణయించారు. మిగిలిన వాటిపై అదనంగా సెస్సు, ఇతర పన్నులు వేశారు.


ప్రాణాలతో చెలగాటం

గన్‌ హయాంలో ఆర్టీసీలో కొత్త బస్సుల ఊసే లేదు. పాతవాటికే పైపై మరమ్మతులు చేసి నడుపుతున్నారు. దీనివల్ల అవి ఎక్కడికక్కడ మొరాయించడమే కాదు.. ప్రమాదాలకు గురవుతున్నాయి. విడిభాగాల కొరత వేధిస్తున్నా.. అరకొరగానే మరమ్మతులు చేసి రోడ్ల మీదకు వదులుతున్నారు. వీటిని పూర్తిగా తీసేయాలన్నా.. తొలగించలేని పరిస్థితి. కొత్త నిబంధనల కారణంగా ఒకేసారి ఎక్కువ బస్సులను తుక్కు చేయాల్సి వస్తోంది. పక్కన పెట్టాల్సిన వాహనాల స్థానంలో ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి కొన్ని బస్సులను రప్పించి సర్దుబాటు చేశారు. ఇవి కూడా ఎక్కువ కిలోమీటర్లు తిరిగినవే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా చాలా బస్సులను స్క్రాప్‌నకు పంపాల్సి వచ్చింది. రెండు జిల్లాల్లోని చాలా డిపోల్లో దాదాపు 50 బస్సులు మరమ్మతులకు అవకాశం లేక తుక్కు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఆదేశాలిచ్చారు. వీటిని తెచ్చి 15 సంవత్సరాలు నిండకపోయినా.. వాటి పరిస్థితి సరిగా లేక ఈ నిర్ణయం తీసుకున్నారు.


బస్‌పాస్‌పై రూ.5000

-రవితేజ, తేలప్రోలు, ఉంగుటూరు మండలం

2019లో బీటెక్‌లో చేరా. అప్పుడు త్రైమాసిక బస్‌పాస్‌ తేలప్రోలు నుంచి విజయవాడకు రూ.1500. ప్రస్తుతం రూ.1800 చేశారు. నెలకు రూ.5 వేలు అదనపు భారం పడింది. దీనివల్ల ఇంట్లో బడ్జెట్‌ తలకిందులైంది.  జగన్‌ హామీకి ఆయనే తూట్లు పొడవడం దారుణం.


ఇలా పెంచడం ఇబ్బందికరమే..

-ఎస్‌.కల్యాణ్‌, బీసీఏ ఫైనలియర్‌

ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపాలెం నుంచి నగరంలోని కొత్తపేట కళాశాలకు వస్తాను. మూడేళ్లుగా కళాశాలకు వచ్చి వెళ్తున్నా. ప్రస్తుతం 3 నెలలకు బస్‌పాస్‌ రూ.940లు ఖర్చవుతోంది. గతంలో ఇదే 3 నెలలకు రూ.540లు అయ్యేది. ఈ ప్రభుత్వం విద్యార్థుల బస్‌ పాస్‌లు సైతం వదలకుండా ఛార్జీలు పెంచి మాపై భారం మోపింది. ఇలా పెంచడం ఇబ్బందికరమే. విద్యార్థులకు ఉచితంగా పాస్‌ ఇచ్చేలా చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని