logo

కార్మికుల కడుపుకొట్టి.. గుత్తేదార్లకు దోచిపెట్టి

కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్‌ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 Apr 2024 04:48 IST

ఇసుక రేవుల్లో గుత్తేదారుల ఇష్టారాజ్యం
యంత్రాల వినియోగంతో వీధిన పడిన కుటుంబాలు
న్యూస్‌టుడే, లంకపల్లి(పమిడిముక్కల)

కార్మికులకు అండగా ఉంటానంటూ ఆశలు రేకెత్తించి గద్దె నెక్కిన జగన్‌ నదుల్లోని ఇసుకను యంత్రాలతో ఎగుమతికి ప్రోత్సహించి మూడున్నరేళ్లుగా వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి గుత్తేదారులకు రూ.కోట్లు దోచిపెట్టారని లంకపల్లి, శ్రీకాకుళం, తోట్లవల్లూరు, శ్రీకాకుళం తదితర ఇసుక రేవుల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి రేవులో నిత్యం 150 మందికి తక్కువలేకుండా ఒక్కొక్కరికి రూ.1,500 కూలికి పని చేసేవారమని లంకపల్లి పరిసరగ్రామాల కార్మికులు తెలిపారు. వర్షాకాలం పోనూ 300 రోజులు పనిచేసినా మొత్తం మీద సుమారు రూ.7 కోట్లకుపైగా ఇక్కడి కార్మికులకు దక్కేదని తెలిపారు. శ్రీకాకుళం, తోట్లవల్లూరు రేవులపై ఇంకా అధికంగా కార్మికులు ఆధారపడి ఉన్నామన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమపై ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుత్తేదారులు పదుల సంఖ్యలో యంత్రాలు ఉపయోగిస్తూ తమ పొట్ట కొట్టారని కార్మికులు ఆందోళన నిర్వహిస్తే పోలీసులతో తమను అడ్డుకున్నారని అప్పారావుపేటకు చెందిన కార్మికులు పేర్కొన్నారు. కలెక్టర్లకు, గనుల శాఖ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా కనికరించలేదని.. చివరికి ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను ప్రాధేయపడినా ఆ విషయం మర్చిపోండని సమాధానమిచ్చారని, కాదని ముందుకెళ్తే కష్టాల్లో పడతారని స్థానిక నాయకులు హెచ్చరించారని వాపోయారు. గుత్తేదారులు యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తోడేసి పెద్ద గుంతలు చేశారని ఆరోపించారు. గతంలో నదిలోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలించేందుకు అనుమతులుండేవని, ఇప్పుడు నదిలోకి ట్రాక్టర్లు దిగకుండా కట్టడిచేసి వారి కడుపు కొట్టారని ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. తాజాగా తమకు తాత్కాలిక తాయిలాలు చూపించి ఓట్ల కోసం తిరుగుతున్నారని, వాటి కోసం ఆరాటపడితే ఎనిమిది నెలలపాటు పనులు దొరక్క కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇసుక కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.


నమ్ముకున్న ప్రభుత్వమే నట్టేట ముంచింది

- ఇసుక కార్మికుడు

కార్మికుల బతుకులు బాగుచేస్తామన్న వైకాపా నాయకుల మాటలు నమ్మి గెలిపిస్తే మా బతుకులను నట్టేట ముంచారు. నాలుగేళ్లుగా రేవులోకి అడుగెట్టనీయకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారులకే అధికారులు, ప్రభుత్వం వంతపాడింది. ఫలితంగా పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. పిల్లల చదువులకు, కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు అప్పులపాలయ్యాను. ఉపాధి చూపే ప్రభుత్వం వస్తేనే మా బతుకు బండి సాగుతుంది.


కార్మికుల కడుపు కొట్టారు

- ఇసుక కార్మికుల సంఘం నాయకుడు

సంస్కరణలంటూ ప్రభుత్వం కార్మికుల ఉపాధి పోగొట్టడంతో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది.. లంకపల్లి, శ్రీకాకుళం రేవుల్లో వందలాది కార్మికులు పని చేసి కుటుంబాలను పోషించుకునేవారు. గుత్తేదారులు కార్మికుల పొట్ట కొడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కిమ్మనకపోవటం శోచనీయం.  కార్మికులకు అవకాశం ఇచ్చే ప్రభుత్వాల కోసం ఎదురుచూస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని