logo

బుద్ధవిహార్‌కు వైకాపా గ్రహణం

ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు.

Published : 29 Apr 2024 05:16 IST

నిధులు విదల్చని పర్యాటక శాఖ
అయిదేళ్లలో ఒక్కసారీ సందర్శించని మంత్రి
న్యూస్‌టుడే, ఘంటసాల

బుద్ధవిహార్‌..  పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వీలుగా ఘంటసాలలో తలపెట్టిన ఈ పర్యాటక ప్రాజెక్టు నిర్మాణ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలో చకచకాసాగాయి. దాదాపు రూపురేఖలు వచ్చాయనుకునే సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి.


నేడు ఇలా..  వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు విదల్చకపోవడంతో పనునలు సగంలో ఆగిపోయి నిర్మాణ ప్రాంతం వెలవెలబోతోంది. పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రోజారెడ్డి అయిదేళ్లలో ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించకపోగా నిధులు కేటాయించలేదు. ఎమ్మెల్యే సంహాద్రి రమేష్‌బాబు కూడా పట్టించుకోకపోవడంతో సగంలో ఆగిపోయి బౌద్ధ భిక్షువుల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది.

ప్రాచీన చరిత్ర కలిగిన ఘంటసాలలో ఏపీ పర్యాటక శాఖ ద్వారా 2017లో బుద్ధ విహార్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి విడతగా రూ.1.5 కోట్లు మంజూరు చేయగా రెండంగస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయుడు గొర్రెపాటి రంగనాథబాబు 2 ఎకరాల వ్యవసాయ భూమిని పర్యాటక శాఖకు విరాళంగా రాసిచ్చారు. ఈ స్థలంలో 2017లో నాటి కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, అప్పటి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, నాటి ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎన్నారై రంగనాథబాబు, స్థానిక బౌద్ధభిక్షువు ధర్మదజ బంతేజితోపాటు దేశ విదేశాల నుంచి 200 మందికిపైగా బౌద్ధ భిక్షువులు విచ్చేసి బౌద్ధ సంప్రదాయాలతో బుద్ధ విహార్‌ నిర్మాణానికి    శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  


శయన బుద్ధుని భారీ విగ్రహంతో..

మ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు ఉన్న హయాంలో హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిలువెత్తు బుద్ధుని విగ్రహం, నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ధ్యాన బుద్ధుడి విగ్రహం నెలకొల్పారు. అదే తరహాలో ఒకప్పటి ప్రముఖ ఓడరేవు ఘంటసాలలో 100 అడుగులు శయన బుద్ధుడు భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు. బౌద్ధులకు ధ్యాన మందిరంతోపాటు బౌద్ధ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


పనులు పడకేశాయిలా..

2019 ఎన్నికలకు ముందు బుద్ధవిహార్‌ రెండంతస్తుల భవనం శ్లాబు పనులు శరవేగంగా సాగాయి. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులన్నీ నిలిపివేశారు. పర్యాటక శాఖ మంత్రి రోజారెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పట్టించుకున్న దాఖలు లేవు. ఐదేళ్లుగా నిధులు విదల్చకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన తయారైంది. బౌద్ధవిహార్‌ ప్రాంగణంలో శిలాఫలకం శిథిలమైంది. భవనాల శ్లాబులకు వినియోగించిన యంత్రం తుప్పు పట్టి పాడైంది. భవనం ముందు ఎత్తైన ఇనుప చువ్వలు వానకు తడిసి ఎండకు ఎండుతున్నాయి. ముళ్లచెట్లు, పిచ్చి మొక్కలతో ఈ ప్రాంగణం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. బుద్ధవిహార్‌ నిర్మాణం పూర్తయితే దేశ, విదేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులతోపాటు, పర్యాటకులకు ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందోనని జిల్లా ప్రజలతోపాటు బౌద్ధభిక్షువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని