logo

వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం

ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్‌లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.

Published : 19 Apr 2024 03:56 IST

విద్యుత్తు లైన్ల నిర్వహణా లోపంతో ప్రాణాలు పోతున్న వైనం

మలకవేములక్రాస్‌లో మిద్దెపై చేతికందే ఎత్తులో తీగలు.. ఇవే బాలుడి ప్రమాదానికి కారణమయ్యాయి.

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్‌లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ లైన్‌ కింద ఇప్పటి వరకు ఏడుగురు ప్రమాదాలకు గురయ్యారు. తక్కువ ఎత్తులో ఉన్న తీగలను తొలగించాలని పలుమార్లు విద్యుత్తు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చివరికి ప్రమాదానికి దారితీసింది. ఇలాంటి ఘటనలు ముదిగుబ్బ మండలంలో ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో చాలా జరిగాయి. పది మంది ప్రమాదాల బారినపడి మృతిచెందారు. అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా వైకాపా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరం. ముదిగుబ్బ మండలంలో 16 వేల గృహ, 7,500 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. చాలాచోట్లా నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. వాటికి కనీస రక్షణ కంచెలు కూడా ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల స్తంభాలు ఒరిగి విద్యుత్తు తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.

ఫిర్యాదులు చేసినా..

ముదిగుబ్బలో ఇళ్లకు ఆనుకుని స్తంభాలు, నివాసాలపై విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని మార్పు చేయాలని ప్రజలు పలుమార్లు విన్నవించినా విద్యుత్తు శాఖాధికారులు పట్టించుకోలేదు. చిన్నారులు నివాసాలపై ఆడుకునేందుకు వెళ్లినప్పుడు, మెట్లు ఎక్కేసమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఫలితంగా ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.

ముదిగుబ్బ: ఇంటికి ఆనుకొని ప్రమాదకరంగా తీగలు

చర్యలు తీసుకుంటాం

మలకవేములక్రాస్‌లో 11కేవీ విద్యుత్తు లైన్‌ కింద నివాసాలు కట్టుకున్నారు. ఆ లైన్‌ మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.  విద్యుత్తు తీగలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని మార్చేందుకు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపాము. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా త్వరలోనే విద్యుత్తులైన్లు మార్పించి.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

సుబ్రహ్మణ్యం, విద్యుత్తుశాఖ డీఈ, కదిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని