logo

నామినేషన్ల పర్వం ఆరంభం

సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది.

Updated : 19 Apr 2024 06:16 IST

తొలి రోజు లోక్‌సభకు రెండు.. అసెంబ్లీకి తొమ్మిది దాఖలు

శింగనమల: నామపత్రాలు సమర్పిస్తున్న తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, కుటుంబసభ్యులు, ఆలం నరసనాయుడు తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గురువారం కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ నుంచి అక్కడక్కడ వారి బంధువుల ద్వారా నామినేషన్లు దాఖలు పరిచారు. అనంత లోక్‌సభకు ఇద్దరు, ఏడు శాసనసభ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్క గుంతకల్లు నియోజకవర్గంలో బోణీ కాలేదు. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి కలెక్టరేట్‌లో కలెక్టర్‌/ఆర్‌ఓ వినోద్‌కుమార్‌ నామపత్రాలను స్వీకరించారు.  ఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, పౌర సరఫరాల సంస్థ డీఎం రమేశ్‌రెడ్డి సహకారం అందిస్తున్నారు. తొలి రోజు ఎస్‌యూసీఐ అభ్యర్థి నాగ ముత్యాలు, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీరంగనాథ్‌ గోపీనాథ్‌ ఒకో సెట్‌ నామినేషన్‌ వేశారు. వారి నామపత్రాలను ఏఓ అంజన్‌బాబు, ఉప తహసీల్దారు మంజుల పరిశీలించారు.

శాసనసభకు 9 మంది.. 10 సెట్లు

ఒక్క గుంతకల్లు నియోజకవర్గంలో ఎవరూ నామినేషన్‌ వేయలేదు. మిగిలిన ఏడు శాసనసభ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్‌ వేశారు. ఉరవకొండ నియోజకవర్గానికి తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ తరఫున కుటుంబసభ్యులు ఒక సెట్‌ అందజేశారు. అనంత అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర్‌ ప్రసాద్‌ తరఫున ఒక సెట్‌,  వైకాపా నుంచి అనంత వెంకటరామిరెడ్డి తరఫున రెండు సెట్లు,  తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఒక సెట్‌, శింగనమల తెదేపా అభ్యర్థి బండారు శ్రావణశ్రీ ఒక సెట్‌, రాయదుర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంబీ చిన్నప్పయ్య, ఎస్‌యూసీఐ అభ్యర్థి రాఘవేంద్ర, రాప్తాడు స్వతంత్ర అభ్యర్థి సాకే రాజేశ్‌కుమార్‌, కళ్యాణదుర్గం స్వతంత్ర అభ్యర్థి రంగనాథ్‌ గోపీనాథ్‌ ఒకో సెట్‌ ప్రకారం నామపత్రాలు సంబంధిత ఆర్‌ఓలకు అందజేశారు.

ఉరవకొండ: నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌కు అందిస్తున్న పయ్యావుల కేశవ్‌ సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంత కలెక్టర్‌ కార్యాలయం వందమీటర్ల దూరం వరకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అభ్యర్థి, ఆయన తరఫున నలుగురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం కల్పించారు. కలెక్టరేట్‌ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలోనే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగింది. తొలిరోజు ఎక్కడా సమస్యలు తలెత్తలేదు.


నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు

ఈనాడు, డిజిటల్‌, అనంతపురం: నామినేషన్‌ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. ఆ వివరాలు సంక్షిప్తంగా ఇలా..

అభ్యర్థి: పయ్యావుల కేశవ్‌

పార్టీ: తెదేపా
నియోజకవర్గం: ఉరవకొండ
విద్యార్హతలు: పీజీ
కేసులు: ఒక క్రిమినల్‌ కేసు ఉంది. సీఆర్‌పీసీ 151 కింద కేసు నమోదైంది.
చరాస్తుల విలువ మొత్తం: రూ.3.21 కోట్లు
బంగారం: లేదు
స్థిరాస్తి విలువ: రూ.1.75 కోట్లు  
అప్పులు: రూ.3.35 కోట్లు


అభ్యర్థి: దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

పార్టీ: తెదేపా
నియోజకవర్గం: అనంతపురం అర్బన్‌
విద్యార్హత: ఎంఏ
కేసులు: ఒక కేసు ఉంది. 147, 148, 307, 302, 120 సెక్షన్లు.
చరాస్తులు: రూ.14.67 కోట్లు
బంగారం: 100 గ్రాములు. భార్య వద్ద 800 గ్రాములు
స్థిరాస్తులు: రూ.23.14 కోట్లు
అప్పులు: రూ.3.61 కోట్లు


అభ్యర్థి: బండారు శ్రావణిశ్రీ

పార్టీ: తెదేపా
నియోజకవర్గం: శింగనమల
విద్యార్హత: ఎంఎస్‌
కేసులు: లేవు
చరాస్తులు: రూ.89.67 లక్షలు
బంగారం: 612.5 గ్రాములు
స్థిరాస్తులు: లేవు
అప్పులు: రూ.22.59 లక్షలు


అభ్యర్థి: అనంత వెంకటరామిరెడ్డి

పార్టీ: వైకాపా
నియోజకవర్గం: అనంతపురం అర్బన్‌
విద్యార్హత: ఎంఏ, బీఎల్‌
కేసులు: లేవు
చరాస్తుల విలువ: రూ.89.83 లక్షలు
బంగారం: లేదు
స్థిరాస్తులు: రూ.5.49 కోట్లు, భార్య పేరుతో రూ.2 కోట్లు.
అప్పులు: లేవు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని