logo

టెండరులోనే తిరకాసు.. అద్దె ఎగ్గొట్టినందుకు తాఖీదు

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్‌ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు.

Published : 29 Apr 2024 03:34 IST

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన వాణిజ్య సముదాయంలోని అద్దె గదులు, క్యాంటీన్‌ లీజుదారులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పడ్డారు. కొందరు లీజుదారులు ఏడాది నుంచి అద్దె చెల్లించడంలేదు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అధికార బలాన్ని ప్రదర్శించి గదులు లీజుకు తీసుకున్నారు. గతంలో ఉపకులపతిగా ఉన్న రామకృష్ణారెడ్డి వైకాపాకు విధేయుడుగా పనిచేశారు. ఆయన అద్దె గదుల వేలంలో వైకాపా నాయకులకు వంతపాడారు. నిబంధనలు అతిక్రమించి తనకు ఇష్టమైన వారికి లీజు కట్టబెట్టారు. ఎస్కేయూలో జన్మభూమి క్యాంటీను, ప్రధాన రహదారి పక్కన 5 గదులతో కూడిన వాణిజ్య సముదాయం, గోదావరి మహిళా వసతి గృహం వద్ద ఓ దుకాణ గది ఉన్నాయి. వాటి నుంచి అద్దె వసూలుకు 2022 సంవత్సరంలో టెండరు నిర్వహించారు. ఈ టెండరులోనే తిరకాసు జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అడ్డుగోలుగా అప్పటి ఉపకులపతి గదులు అప్పగించారు. లీజు దక్కించుకున్న నాయకులు వర్సిటీకి అద్దె చెల్లించకుండా బకాయిలు పెడుతున్నారు. ఇద్దరు లీజుదారులు ఏడాదిగా అద్దె చెల్లించలేదు. ఒక్కోగదికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దె చెల్లిస్తామని టెండరులో ఒప్పందం చేసుకొన్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ మినహా ఇతరులు అద్దె చెల్లించడం లేదు. బకాయిలు పేరుకుపోవడంతో ఇటీవల అధికారులు నోటీసులు జారీ చేశారు. తాఖీదు జారీ చేయడంతో కొందరు దుకాణదారులు కొంత చెల్లించారు. 6 నెలల అద్దె చెల్లించాల్సి ఉండగా 2 నెలల అద్దె చెల్లించారు. ఒకరిద్దరు సంవత్సరం నుంచి బకాయి పడ్డారు. ఓ లీజుదారుడు రెండు నెలలుగా దుకాణం పూర్తిగా మూసివేశాడు. అధికార పార్టీ అండతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్నారని వర్సిటీలో పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు