logo

శిక్షణతో రాణింపు.. ఆటలో గుర్తింపు

వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్‌ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్‌ ఆడుతుంటారు.

Published : 16 May 2024 02:31 IST

చిన్నారులతో కళకళలాడుతున్న క్రికెట్‌ మైదానాలు
460 మందికి పైగా హాజరు

బ్యాటింగ్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు

అనంతపురం క్రీడలు, విద్య, న్యూస్‌టుడే: వందమంది విద్యార్థులను ఒకచోట కలిపి మీకు క్రీడల్లో ఏదంటే ఇష్టం అని ప్రశ్నిస్తే 95 శాతం మంది పిల్లలు క్రికెట్‌ అని సమాధానమిస్తారు. క్రీడామైదానాల్లోనే కాదు చిన్నచిన్న వీధుల్లో కూడా పిల్లలు క్రికెట్‌ ఆడుతుంటారు. బ్యాటింగ్‌ చేయాలన్నా, లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ వేయాలన్నా, చక్కటి ఫీల్డింగ్‌ చేయాలంటే శిక్షణ తప్పనిసరి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రికెట్‌ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాలని ప్రతి విద్యార్థికీ ఆసక్తి ఉంటుంది. అలాంటి పిల్లలకు వేసవిలో ఉచితంగా క్రికెట్‌ శిక్షణ ఇస్తున్నారు. స్థానిక పీటీసీ మైదానంలో అనంతపురం క్రికెట్‌ అసోసియేషన్‌, ఆర్డీటీ సహకారంతో 8 ఏళ్లు నిండిన 460 మంది పిల్లలకు ఈ వేసవి శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. 300 మంది పిల్లలు ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. నెలరోజుల పాటు ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. చదువులతోపాటు క్రీడలు కూడా విద్యార్థులకు ముఖ్యమని గుర్తించిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వేసవి శిబిరాలకు పంపిస్తున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే క్రికెట్‌ శిబిరాలు ప్రారంభమవుతున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఇతర ఫిట్‌నెస్‌ వ్యాయామాలతో మైదానాలు కళకళలాడుతున్నాయి.

  • అనంతపురం నగరంలోని సంజీవరెడ్డి స్టేడియం, అనంత క్రీడాగ్రామం, ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఈ వేసవి ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. సంజీవరెడ్డి స్టేడియంలో 210 మంది కొత్తగా ఆట నేర్చుకోవడానికి వస్తున్నారంటే ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆట నేర్చుకున్న వారు సైతం పదును పెట్టుకోవడానికి శిబిరాల్లో పాల్గొన్నారు. అనంత క్రీడాగ్రామంలో 180 మంది, ఎస్‌ఎస్‌బీఎన్‌లో 70 మంది శిక్షణ పొందుతున్నారు.

ఆట శైలిని బట్టి శిక్షణ

ఆటగాళ్లు మైదానానికి రాగానే బ్యాటింగ్‌, బౌలింగ్‌ నేర్పించడం జరగదు. అసలు వారు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా ఉన్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఫిట్‌నెస్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పిస్తారు. కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు. ఆటలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత ఆటగాడి ఇష్టం, నైపుణ్యాన్ని బట్టి బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌కు ఎంపిక చేస్తారు. బ్యాటింగ్‌ అయితే బంతి వచ్చే విధానాన్ని బట్టి ఏ డ్రైవ్‌లో ఆడాలో మెలకువలు నేర్పిస్తారు. షార్ట్‌పిచ్‌, యార్కర్‌, పుల్‌టాస్‌, స్పిన్‌ బంతులను ఎలా ఆడాలో కిటుకులు నేర్పిస్తారు. అదే బౌలింగ్‌ అయితే బ్యాట్స్‌మెన్‌ ఆడే తీరును బట్టి బంతిని సంధించే విధానాలపై తర్ఫీదునిస్తారు. వీటితో పాటు ఫీల్డింగ్‌ చేసే విధానాలపై అవగాహన కల్పిస్తారు.

ఉత్తమ శిక్షకులతో శిబిరాలు

శిక్షణ శిబిరాల్లో మంచి అనుభవం, ఆసక్తి ఉన్న వారితో నిర్వహిస్తున్నారు. ఆర్డీటీలో ప్రవీణ్‌, సంజీవరెడ్డి స్టేడియంలో టి.వి.చంద్రమోహన్‌రెడ్డి, ఎస్‌ఎస్‌బీఎన్‌లో శర్మాస్‌వలి, యుగంధర్‌రెడ్డి శిక్షణ ఇస్తున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాల ద్వారా ఎంతో మంది అధికారిక పోటీలకు ఎంపిక కావడంతో ఆసక్తి పెరుగుతోంది.

బ్యాటర్‌గా ఎదగాలన్నదే నా కోరిక

క్రికెట్‌లో మంచి బ్యాటర్‌గా ఎదగాలన్నదే నా ఆశయం. ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. ఆటలోని నిబంధనలు, ఫిట్‌నెస్‌పై అవగాహన ఏర్పడింది. శిక్షణ శిబిరంలో పాల్గొనడం వల్ల మెలకువలు నేర్చుకున్నా. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎలా చేయాలో కొంత అవగాహన ఏర్పడింది. భవిష్యత్తులో మంచి క్రికెటర్‌గా జిల్లాకు సేవలు అందిస్తాను.

తరుణిక

ఎంతో ఉపయోగం

ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. క్రికెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. చక్కగా ఆడాలనే ఉద్దేశంతో శిక్షణ శిబిరానికి వస్తున్నాను. ఇది ఎంతో ఉపయోగపడుతోంది. జాతీయస్థాయి క్రీడాకారుడు కావాలనే లక్ష్యంతో శిక్షణకు వస్తున్నాను.

శ్రవణ్‌, అనంతపురం

మూడేళ్ల నుంచి తర్ఫీదు

మూడేళ్ల నుంచి ఆర్డీటీ స్టేడియంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆర్డీటీ, జిల్లా క్రికెట్‌ సంఘానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి ఏటా వందలాంది మంది హాజరవుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయికి ఎంతో మంది ప్రాతినిథ్యం వహించారు. పాఠశాల క్రికెట్‌లో జాతీయ స్థాయికి పలువురు ఎంపికయ్యారు. క్రీడాకారుల ప్రతిభను బట్టి తర్ఫీదు ఇస్తాం. సహజ సిద్ధమైన నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి సానబెడుతున్నాం.

ప్రవీణ్‌, శిక్షకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని