logo

బోరు తవ్వకం అడ్డగింత

పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు.

Published : 29 Apr 2024 03:35 IST

వైకాపా నాయకులపై ఎదురుతిరిగిన ప్రజలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని కోటవీధిలో ప్రజలు చందాలు వేసుకుని బోరు తవ్వకం చేపట్టగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. స్థానికులు తిరగబడటంతో వారిపై కేసు నమోదు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కోట వీధిలో చాలా రోజులుగా నీటి సమస్య వేధిస్తోంది. స్థానికులంతా చందాలు వేసుకుని ఓ ప్రైవేటు స్థలంలో బోరు తవ్వించేందుకు సమాయత్తం అయ్యారు. ఎన్నికల కోడ్‌ రాకముందే అనుమతి కోసం గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల చుట్టూ తిరిగారు. ఇటీవల ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బోరు తవ్వకానికి అనుమతి ఇచ్చారు. శనివారం సాయంత్రం బోరు వేయించడానికి లారీని తీసుకురాగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. తెదేపా నాయకులు ఇదంతా చేస్తున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆదివారం మండల ఎంసీసీ(మోడల్‌ కోడ్‌ కండెక్ట్‌) అధికారి అమృతరాజు, పంచాయతీ కార్యదర్శి గౌస్‌సాహెబ్‌తో కలిసి విచారణ చేపట్టారు. తాము చందాలు వేసుకుని, బోరు తవ్వుకుంటున్నామని స్థానికులు ఘంటాపథంగా చెప్పారు. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, అధికార నాయకులు అడ్డుకోవడం బాధాకరం అన్నారు. బోరు తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్న అధికారులకు వైకాపాకు చెందిన ఓ యువ నాయకుడు ఫోన్‌ చేసి బోరు వేయించే పనిని ముందుకు తీసుకెళ్తున్న ముస్లిం యువకులతోపాటు అందులో ప్రమేయం ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఫిర్యాదు చేసిన వైకాపా నాయకులను ఇక్కడికి రప్పించాలని పట్టుబట్టారు. నీటి కోసం అవస్థ పడుతుంటే, అడ్డుకోవడం విస్మయాన్ని కలిగిస్తుందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని