logo

ఐదేళ్లలో వక్కసారీ ఇటు చూడలేదే..

వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు.

Published : 29 Apr 2024 03:46 IST

మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చి వంచించిన జగన్‌
కర్ణాటక ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను

గౌడనకుంటలో సాగుచేసిన వక్కతోట

మడకశిర, అమరాపురం, న్యూస్‌టుడే: వక్క సాగులో మడకశిర నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రసిద్ధి. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతం సాగుకు అనుకూలంగా ఉండటంతో 150 ఏళ్లుగా పంట పండిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం 220 ఎకరాలు, రాయదుర్గం 150, హిందూపురం 100, మడకశిర 3,200 మొత్తం 3,670 ఎకరాల్లో వక్క సాగులో ఉంది. ఏడాదికి దాదాపు 18 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు విలువ చేసే క్రయ, విక్రయాలు సాగుతున్నాయి. ఒక్కసారి సాగుచేస్తే వందేళ్ల వరకు దిగుబడి ఇవ్వడం ఈ పంట ప్రత్యేకత.

సీఎం హామీకి ఐదేళ్లు..

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో మడకశిరకు వచ్చి వక్క రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాలన ముగుస్తున్నా.. ఒక్కసారీ ఇటు చూడలేదు. మార్కెట్‌ ఊసే లేదు. ఇక్కడ పండించిన వక్కకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో కర్ణాటకలోని భీమసముద్రం, శిర, తుమకూరు, దావణగెర తదితర మార్కెట్లకు 160 నుంచి 200 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలతో రవాణా చేసి అమ్ముకుంటున్నారు. రైతులకు ఇబ్బందులతోపాటు పన్ను రూపంలో రూ.15 కోట్లకు పైగా ఆదాయం కర్ణాటక రాష్ట్రానికి వెళుతోంది. తెదేపా ప్రభుత్వంలో అమరాపురం మండల కేంద్రంలో 5 ఎకరాల్లో మార్కెట్ నిర్మించేందుకు స్థల పరిశీలన చేసి రూ.3.5 కోట్ల నిధులు కూడా మంజూరు చేసినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిధులు కాస్త వెనక్కి వెళ్లాయి.

రైతులు ఎండబెట్టిన వక్క

గోదాములు లేక ఇళ్లల్లోనే సరకు

రైతులు పంటను నిల్వ చేసుకోవడానికి ప్రత్యేకంగా గోదాములు నిర్మించకపోవడంతో ఇళ్లల్లోనే రూ.కోట్ల విలువ చేసే సరకు నిల్వ చేసుకుంటున్నారు. ప్రధానంగా తెదేపా హయాంలో రైతుబంధు పథకం అమలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతులు ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని రూ.2 కోట్ల వరకు వడ్డీలేని రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రైతుబంధు అమలు కాకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి వచ్చినకాడికి విక్రయించుకోవాల్సి వస్తోంది. అలా ఇప్పటి వరకు దాదాపు రూ.4 కోట్ల వరకు మోసపోయారు.

బోర్లలో తగ్గుతున్న నీటి మట్టం

హంద్రీనీవా కాలువల ద్వారా నీరు రాకపోవడంతో చెరువుల్లో జలాలు లేక బోర్లు ఎండిపోతున్నాయి. పంట ఎండుముఖం పట్టి దిగుబడి తగ్గుతోంది. ప్రభుత్వం ఐదేళ్లుగా కాలయాపన చేసిందే తప్ప నీరు అందించడానికి చర్యలు తీసుకోలేదు. 8 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఏటా రూ.30 క్వింటాళ్ల ఎండిన వక్క దిగుబడి వస్తున్నా.. ఒక్కోసారి గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతుల్లో మోసపోతుండటంతో నష్టపోతున్నాం. కూలీల ధరలు అధికంగా ఉన్నందున ఈ పంటను ఉపాధిహామీకి అనుసంధానం చేస్తే బాగుంటుంది. 

రామలింగప్ప, గౌడనకుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని