logo

ఐదేళ్లు.. రూ.600 కోట్లు

ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలను భారీగా వడ్డించింది.

Updated : 29 Apr 2024 05:04 IST

భూవిలువలు పెంచి ఉమ్మడి జిల్లా ప్రజలపై ఆర్థిక భారం మోపిన జగన్‌
వైకాపా పాలనలో స్టాంపులకూ తప్పని తిప్పలు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: ప్రత్యేక సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలను భారీగా వడ్డించింది. ఐదేళ్లలో ప్రత్యేక సవరణలతో కలుపుకొని ఐదుసార్లు పెంచింది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత 2021లో మాత్రమే భూముల విలువలను సవరించలేదు. భూములు కొనుగోలు చేసేవారిపై వైకాపా ప్రభుత్వం భారీగా ఆర్థిక భారం మోపింది. జాతీయ రహదారులు, పారిశ్రామికవాడలు, ప్రధాన కూడళ్లలో ఉన్న భూముల విలువలు ఐదేళ్లలో అమాంతంగా పెరిగాయి. కొన్నిచోట్ల 300 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కామధేనువు లాంటి రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఆదాయం రెట్టింపుగా పిండుకుంది. బహిరంగ మార్కెట్‌ను తలదన్నేలా ఏటా భారీగా పెంచడంతో క్రయవిక్రయాలు పడిపోయాయి.

రిజిస్ట్రేషన్‌శాఖ జిల్లా కార్యాలయం

  • అనంతపురం గ్రామీణ మండలం సోమలదొడ్డిలో ఎకరా వ్యవసాయ భూమి విలువ ఏడాది కిందట రూ.8 లక్షల వరకు ఉండేది. అప్పట్లో ఎకరా భూమి క్రయవిక్రయాలు జరిగితే స్టాంపు డ్యూటీ, ప్రభుత్వ రుసుం కలిపితే రూ.60 వేల ఆదాయం రిజిస్ట్రేషన్‌శాఖ పద్దుకు జమయ్యేది. ఇందులో స్టాంపు డ్యూటీ కింద రూ.52 వేలు, ప్రభుత్వ రుసుం కింద రూ.8 వేలు కొనుగోలుదారు భరించేవారు. ఇవికాకుండా యూజర్‌ ఛార్జీలు రూ.వెయ్యి వరకు అదనంగా ఉండేవి.
  • ప్రస్తుతం అదే గ్రామంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. వ్యవసాయ భూమి ఎకరా రూ. 8 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచింది. అంటే 275 శాతం పెంచింది. దీని ప్రకారం కొనుగోలుదారులు ప్రస్తుతం రూ.2.25 లక్షలు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు భరిస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు 60 వేల నుంచి రూ.2.25 లక్షలకు పెరిగాయన్నమాట. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఛార్జీలు పెంచారు. ఉమ్మడి అనంత జిల్లాలో భూముల విలువలు భారీగా పెరగడంతో ప్రజలపై ఐదేళ్లలో రూ.600 కోట్లకు పైగా భారం పడింది. స్వల్పం అంటూ ప్రజలను నమ్మించి గుట్టుగా భారీగా పెంచేశారు. ప్రభుత్వం బయటకు పొక్కకుండా భూముల విలువలు పెంచడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఐదేళ్లలో బహిరంగ మార్కెట్‌కు దీటుగా విలువలు పెంచిన ఘనత వైకాపాదేనని చెప్పవచ్చు.  ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. భూముల విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది. నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించిన దాఖలాలు లేవు.

స్వల్పమే అంటూ 275 శాతం వడ్డన

2019 ఆగస్టు 1న గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో వైకాపా ప్రభుత్వం తొలిసారిగా భూముల విలువ పెంచింది. 2020 ఆగస్టు 10న అర్బన్‌ ప్రాంతాల్లో పెంచింది. 2021లో కరోనా కారణంగా పెంపు జోలికి వెళ్లలేదు. 2022 జూన్‌ 1న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విలువలు సవరించారు. 2022 జూన్‌ 6న ప్రత్యేక సవరణ పేరుతో శ్రీసత్యసాయి జిల్లాలో పెంచారు. 2023 జూన్‌ 1న ప్రత్యేక సవరణ పేరుతో 30 నుంచి 275 శాతం వరకు భూముల విలువలు పెంచారు.

వినియోగదారుల బాధలు వర్ణనాతీతం

ఐదేళ్లలో స్టాంపుల కొరత ప్రజలను పట్టి పీడించింది. ప్రభుత్వం స్టాంపుల అమ్మకాలను పూర్తిగా ప్రైవేటు పరం చేసింది. నాసిక్‌ నుంచి కొనుగోలు చేయలేని ప్రభుత్వం ఈ-స్టాంపింగ్‌కు ద్వారాలు తెరిచింది. దీనివల్ల ప్రజలకు అదనపు భారం పడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్టాంపుల కోసం ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర జిల్లాల్లో ఉన్న స్టాంపులను ఇక్కడికి సరఫరా చేసి తాత్కాలికంగా ఉపశమనం చేశారు. అలాగే ప్రైమ్‌.2 సాఫ్ట్‌వేర్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు పరిచయం చేయడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో సమస్యతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. కొన్నిచోట్ల దస్తావేజు చేతికి అందాలంటే నెలల సమయం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని