logo

సీఎం రాగానే.. జనం జారుకున్నారు

తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు.

Published : 29 Apr 2024 03:53 IST

ప్రసంగం తేలిపోవడంతో కార్యకర్తల అసంతృప్తి
ఆత్మస్తుతి, పరనిందతోనే సరిపెట్టిన జగన్‌

జగన్‌ మాట్లాడుతున్న సమయంలో ఇంటి దారి పట్టిన వైకాపా కార్యకర్తలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం- న్యూస్‌టుడే, తాడిపత్రి, తాడిపత్రి పట్టణం: తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా మొదలుపెట్టడంతో సభకు వచ్చిన జనం మొదట్లోనే జారుకున్నారు. పది నిమిషాల్లోనే సగానికి పైగా వెళ్లిపోయారు. ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోను జగన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం. తనను తాను పొగుడుకోవడం.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను తిట్టడానికే పరిమితమయ్యారు. ఐదేళ్లలో ఎన్ని బటన్లు నొక్కారు? ఎంతమంది ఖాతాలో నగదు జమ చేశారో వంటి అంశాలు మినహా కొత్తగా ఏమీ మాట్లడలేదు. ఎక్కడా అనంత జిల్లా పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

యల్లనూరు రోడ్డు బైపాస్‌లో ఓవైపు రాకపోకలు నిలిపివేత

ఫ్యాక్షన్‌ మొదలుపెడతానన్న ఎమ్మెల్యే మంచివాడా?

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి సీఎం మాట్లాడుతూ... మాట కొంచెం కఠినం కానీ.. మనిషి చాలా మంచివాడు అంటూ పొగిడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఐదేళ్లలో వ్యవహరించిన తీరు తాడిపత్రితో పాటు జిల్లా మొత్తానికి తెలుసు. మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలుపెడతానని బహిరంగంగా చెప్పిన ప్రజాప్రతినిధిని మంచివాడంటూ ఎలా చెబుతారని స్థానికులు నిలదీస్తున్నారు. గంటన్నర ఆలస్యంగా తాడిపత్రి సభాప్రాంగణానికి చేరుకున్న జగన్‌.. హడావుడిగా ప్రసంగాన్ని ముగించారు. జనం పెద్దగా రాకపోవడంతో.. కప్పిపుచ్చేందుకు వైకాపా నాయకులు నానాతంటాలు పడ్డారు. సభకు వచ్చిన వారికి మందు, బిర్యానీతో పాటు రూ.500 డబ్బులు పంపిణీ చేశారు.

తాడిపత్రిలో దుకాణ సముదాయాల మూసివేత

అడుగు పెట్టాడంటే కష్టాలే..

సీఎం జగన్‌ పర్యటనతో తాడిపత్రి వాసులకు కష్టాలు తప్పలేదు. పుట్లూరు రోడ్డు నుంచి పోలీస్‌స్టేషన్‌ సభా ప్రాంగణం వరకు సుమారుగా వంద చెట్ల కొమ్మలు తొలగించారు. కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్నాయని ఏకంగా విద్యుత్తు తీగలను తొలగించారు. టైలర్స్‌కాలనీ, కృష్ణాపురం రోడ్డు, రెడ్డివారిపాలెం పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వేసవి తాపానికి తట్టుకోలేక పట్టణవాసులు అవస్థలు పడ్డారు. పోలీసుల ఆంక్షలతోనూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టీసీ బస్సులను బైపాస్‌ నుంచి మళ్లించడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రయాణికులను దింపేశారు. యల్లనూరు రోడ్డు నుంచి అశోక్‌పిల్లర్‌ వరకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. పుట్లూరు రోడ్డు, సభా ప్రాంగణంలో దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఆఖరికి మందుల దుకాణాలనూ బంద్‌ చేయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా పోలీసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సుమారు 2 వేల మంది పోలీసుల్ని బందోబస్తుకు కేటాయించారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ స్వయంగా బందోబస్తు పర్యవేక్షించడం గమనార్హం.

రెడ్డివారిపాళెం దారిలో తొలగించిన విద్యుత్తు తీగలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని