logo

మైనింగ్‌ మాయగాళ్లు..

గనులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు.

Updated : 29 Apr 2024 04:59 IST

గుట్టలు, కొండలు ఆరగించిన అధికార పార్టీ నాయకులు
ఐదేళ్లలో చెలరేగిపోయిన వైకాపా మట్టి మాఫియా

గుట్టలు, కొండలు మింగే అనకొండలు, క్వారీలను కొల్లగొట్టే కేటుగాళ్లు.. ఉమ్మడి అనంత జిల్లా వైకాపాలోని కొందరు ప్రజాప్రతినిధుల అంతర్గత రూపమది. ఐదేళ్ల వైకాపా పాలనలో మైనింగ్‌ మాయగాళ్లు చేయని అరాచకం లేదు. అధినేతను ఆదర్శంగా తీసుకున్నారేమో రెచ్చిపోయి సహజ సంపదను దోచేస్తున్నారు. గుట్టలకు గుండ్లు కొట్టి ఎర్రమట్టిని మింగేశారు. కొండలను కరిగిచి కంకర తోడేశారు. అనుమతులతో పనిలేకుండా.. పైసా ఖర్చు పెట్టకుండా రూ.కోట్లు దోచేశారు. కన్నుపడితే ఖతం అన్నరీతిలో వైకాపా నాయకుల మైనింగ్‌ దందా కొనసాగింది. జగన్‌ ఏలుబడిలో అధికార పార్టీ నాయకుల అక్రమ మైనింగ్‌ సంపాదన రూ.500 కోట్లు దాటేసిందని అంచనా.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం

నులను వైకాపా నాయకులు కొల్లగొడుతున్నారు. దోపిడీకి చిరునామాగా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రయివేటు వ్యక్తులకు ప్రకృతి సంపదను దాసోహం చేశారు. నిబంధనలకు పాతరేసి ఉమ్మడి జిల్లాలో మట్టి, కంకర, గ్రానైట్‌, క్వార్‌్్ట్జ తదితర ఖనిజాల్ని దోచేస్తున్నారు. అడ్డుచెప్పిన అధికారుల్ని బదిలీ చేయించి... అవినీతి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గనుల్ని దిగమింగుతున్నారు. లీజుదారులు తవ్విన ఖనిజానికి పర్మిట్ల జారీ చేయడంతో పాటు అక్రమంగా తరలించకుండా పర్యవేక్షించడం గనుల శాఖ బాధ్యత. రెండేళ్ల కిందట ఆ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించారు. ఉమ్మడి అనంత జిల్లాలో వైకాపాతో అత్యంత సన్నిహితంగా ఉండే వారికే బాధ్యతలు కట్టబెట్టారు. మట్టి, కంకర తదితరాల సీనరేజి వసూళ్లన్నింటినీ అప్పనంగా అప్పగించారు. కంప్యూటరైజ్డ్‌ పర్మిట్ల విధానాన్ని మార్చేసి.. చేతిరాతతో జారీ చేస్తున్నారు. నెలవారీ రాబడి వివరాలను గనులశాఖకు ఇవ్వడం లేదు. ఇసుక తవ్వకాలు, విక్రయాలపై గుత్తేదారులు చెప్పిన లెక్కలే అధికారులు రాసుకోవాల్సి వస్తోంది. ‘పెద్ద’ మంత్రి అండతో జిల్లా నాయకులు అక్రమాలకు తెగపడుతున్నారు.  

యథేచ్ఛగా దోపిడీ

  • శింగనమల ప్రజాప్రతినిధి భర్త నేతృత్వంలో నియోజకవర్గంలోని కొండలను ఆయన అనుచరులు కరిగించేశారు. బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల మండలాల్లో కొండలను పిండి చేశారు. ఆయన బంధువు ఒకరు ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమ తవ్వకాల కారణంగా గుట్టలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. గ్రామాల్లోనూ ఎర్రమట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధి భర్త.. మట్టిలో అక్రమ సంపాదన రూ.50 కోట్లు దాటిందనే ప్రచారం జరుగుతోంది.
  • తాడిపత్రి కీలక నేత ఆధ్వర్యంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అభివృద్ధి పనుల పేరిట అనుమతులు తీసుకుని ప్రైవేటుకు మట్టిని విక్రయిస్తున్నారు. ఎక్కడికెక్కడ తాత్కాలిక పర్మిట్లు తీసుకుని నెలల కొద్ది తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. పెద్దవడుగూరు, యాడికి పరిధిలోని స్టీటైట్‌ గనుల నిర్వహకుల నుంచి కమీషన్లు దండుకుంటున్నారు. యాడికి పరిధిలోని బలపం ఫ్యాక్టరీల నిర్వహకులను బెదిరించి కమీషన్లు దండుకుంటున్నారు. ఐదేళ్లలో సదరు నేతకు కమీషన్ల రూపంలో రూ.50 కోట్లకు పైగా ముట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.

భారీగా వసూళ్లు

కళ్యాణదుర్గంలో మొన్నటివరకు అధికారం వెలగబెట్టిన ఓ మహిళ ప్రజాప్రతినిధి గ్రానైట్‌ క్వారీల నిర్వహకుల నుంచి భారీగా వసూలు చేశారు. ఇక్కడ గ్రానైట్‌ క్వారీల లీజులు పొందిన తమిళనాడు వ్యాపారులను బెదిరించి కమీషన్లు లాక్కున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అధికారుల్ని ఉసిగొల్పి క్వారీలను మూసి వేయించారు. నిర్వాహకుల మైనింగ్‌ వాహనాలను తెచ్చి పొలంలో పెట్టుకున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వదిలిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె అనుచరులు గుట్ట, కొండను వదలకుండా ఎర్రమట్టి తవ్వకాలు జరిపారు. నాణ్యమైన గ్రావెల్‌ను ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేటు లేఅవుట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఐదేళ్లలో అక్రమ మైనింగ్‌ ద్వారా సుమారు రూ.50 కోట్లు సంపాదించారని సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని