logo

కష్టపడే ప్రతి కార్యకర్తకూ ప్రాధాన్యం

‘మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లా భావించి సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చుతున్నారు. మళ్లీ ఆయన్ను సీఎంను చేసేందుకు కృషి చేస్తామని

Published : 29 Jun 2022 02:24 IST

వైకాపా జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి


అభివాదం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి, శాసన సభ్యులు, నాయకులు

జీవకోన (తిరుపతి): ‘మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లా భావించి సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చుతున్నారు. మళ్లీ ఆయన్ను సీఎంను చేసేందుకు కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి’ అని వైకాపా జిల్లా అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతి తారకరామా మైదానంలో మంగళవారం ఆయన అధ్యక్షతన తిరుపతి జిల్లా వైకాపా ప్లీనరీ నిర్వహించారు. ప్రతి కార్యకర్తా పార్టీని జనంలోకి తీసుకుపోవాలని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు గగ్గోలు పెట్టినా.. మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రచారం చేసినా జనం ఆదరణ చూపుతున్నారని తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమానికి వస్తే జనం మాపై ఎలాంటి అభిమానం చూపుతున్నారో తెదేపా నాయకులకు తెలుస్తుందన్నారు. తిరుపతి జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికతోపాటు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పార్టీకి ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే పవన్‌కల్యాణ్‌.. తాను తెదేపాతో భాగస్వామిగా ఉన్నప్పుడే రైతులకు రూ.23.45 కోట్లు బకాయిలు పెట్టారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. గూడూరు శాసనసభ్యుడు వరప్రసాద్‌రావు మాట్లాడుతూ నవరత్నాల అమలులో భాగంగా సీఎం జగన్‌  కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టారని తెలిపారు. శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తెదేపాది అంతా పబ్లిసిటీ అని, వారికి 99 శాతం మీడియా బలముందన్నారు. ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు ఇస్తున్నా వైకాపాకు పబ్లిసిటీ రావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, తిరుపతి నగర మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని