logo

అప్పులు ఎలా తీర్చాలి?

ఓ వైపు పంట సాగుకు తీసుకున్న డబ్బులు చెల్లించాలని వ్యాపారుల ఒత్తిళ్లు.. మరోవైపు గానుగ ఆడించిన నల్లబెల్లం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవేళ వచ్చినా

Published : 29 Jun 2022 02:24 IST

ఆంక్షలతో నష్టపోతున్న నల్లబెల్లం రైతులు
నెలల తరబడి ఇళ్లలోనే నిల్వ చేస్తున్న వైనం

ఈ చిత్రంలోని రైతు పేరు జి.విద్యాసాగర్‌ నాయుడు. పెనుమూరు మండలం గొబ్బిళ్లమిట్ట గ్రామంలో ఈయన రెండెకరాల్లో చెరకు సాగు చేశారు. ప్రస్తుతం విద్యాసాగర్‌ నాయుడు ఇంట్లో 135 బస్తాల నల్లబెల్లం నిల్వ ఉంది. ఎస్‌ఈబీ సిబ్బంది ఆంక్షల మూలంగా నల్లబెల్లం ధర తక్కువగా ఉందని ఆయన అంటున్నారు. ఒకవేళ వ్యాపారులకు విక్రయించినా.. పెట్టిన పెట్టుబడీ రాదని ఆయన వాపోతున్నారు.


ఈనాడు డిజిటల్‌- చిత్తూరు: ఓ వైపు పంట సాగుకు తీసుకున్న డబ్బులు చెల్లించాలని వ్యాపారుల ఒత్తిళ్లు.. మరోవైపు గానుగ ఆడించిన నల్లబెల్లం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవేళ వచ్చినా తక్కువ ధరకు అడుగుతున్నారని వాపోతున్నారు. దీంతో నెలల తరబడి ఇళ్లలోనే నల్లబెల్లాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఇదేక్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలి? వాటికి వడ్డీలు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే చెరకు సాగుకు ప్రసిద్ధిగాంచిన జిల్లాలో మరికొందరు ఆ పంటకు దూరమయ్యే పరిస్థితి ఉంది.


పెనుమూరు మండలం గొబ్బిళ్లమిట్టలోని రైతు ఇంట్లో నిల్వ ఉన్న నల్లబెల్లం

రాష్ట్రంలో చెరకు సాగు అధికంగా ఉండే జిల్లాలో చిత్తూరు ఒకటి. 15 ఏళ్ల కిందట వరకూ 40వేలు- 50వేల ఎకరాల్లో చెరకు పండించారు. సహకార చక్కెర కర్మాగారాలకు విక్రయించడం ద్వారా కొంత లాభాలు వచ్చేవి. క్రమేణా పెట్టుబడి వ్యయం పెరగడం, కర్మాగారాలు వేర్వేరు కారణాలతో మూతపడటంతో ప్రస్తుతం ఇది 15 వేల ఎకరాలలోపే ఉంది. ప్రస్తుతం ఎకరా చెరకు సాగుకు రూ.50వేలు- రూ.70వేలు ఖర్చవుతోంది. ఎక్కువగా గంగాధరనెల్లూరు, నగరి, అత్యల్పంగా పుంగనూరు నియోజకవర్గంలో సాగు చేస్తున్నారు. దశాబ్దాలుగా కొందరు గానుగ ఆడించి బెల్లం తయారుచేసి.. మిగతా రైతులతో పోలిస్తే కొంత ఎక్కువ ఆదాయాన్ని అర్జించేవారు. చౌడునేలలు ఉన్న ప్రాంతాల్లో నల్లబెల్లం తయారీ ఉంటోంది. ప్రధానంగా పులిచెర్ల, పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ మండలాల్లో నల్లబెల్లంపైనే ఆధారపడి వేలాదిమంది కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం నాటుసారా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలని నిర్ణయించింది. దీంతో మే నెలలో ఎస్‌ఈబీ సిబ్బంది రంగంలోకి దిగి నల్లబెల్లం కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. ఫలితంగా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అన్నదాతలు, వ్యాపారులు తమ సమస్యను ప్రజాప్రతినిధులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సడలింపులు ఇచ్చారు. నాటుసారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.  

గతంలో కిలో రూ.40.. ఇప్పుడు రూ.20

పోలీసుల ఆంక్షలు తొలగించినా.. వ్యాపారులు మాత్రం ఎప్పుడేం జరుగుతుందోననే ఉద్దేశంతో రైతుల నుంచి తక్కువ ధరకు నల్లబెల్లం కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కిలో రూ.40- రూ.45 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.20- రూ.22కు అడుగుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిచెర్ల మండలంలో పంట సాగుకు ముందు రైతులు.. వ్యాపారుల నుంచి రూ.30 వేలు- రూ.లక్ష వరకు అప్పు తీసుకునేవారు. నల్లబెల్లాన్ని సదరు వ్యాపారులకే విక్రయించేవారు. ఇప్పుడు సరైన ధర లేకపోవడంతో.. మేం ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని వ్యాపారులు ఒత్తిడి తెస్తున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో మాత్రం రెండు- మూడు నెలలుగా రైతుల ఇళ్లలోనే నల్లబెల్లం నిల్వ ఉంది. మంచి ధర వచ్చే వరకు వేచి చూద్దామని భావిస్తున్నా.. తేమ కారణంగా పనికిరాకుండా పోతుందోననే భయం కర్షకులను వెంటాడుతోంది. పోలీసులు పూర్తిస్థాయిలో వ్యాపారులకు భరోసా ఇస్తేనే అన్నదాతలు గట్టున పడే అవకాశం ఉంది.


నాటుసారా తయారీకి విక్రయించవద్దని ఆదేశించాం
- రిషాంత్‌రెడ్డి, ఎస్పీ

రైతుల నుంచి వ్యాపారులు నల్లబెల్లం కొనుగోలు చేయవచ్చు. జిల్లాలో వీటి క్రయవిక్రయాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. నాటుసారా తయారు చేసే వ్యక్తులకు మాత్రం విక్రయించవద్దని ఆదేశించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని