logo

ప్రజల మనిషి చంద్రబాబు

కార్మికుల కోసం బలంగా పోరాడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated : 24 Mar 2024 04:26 IST

అందరికీ కూటమి అండ
‘మహిళలతో మాటామంతీ’లో నారా భువనేశ్వరి 

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, చిల్లకూరు, వాకాడు: కార్మికుల కోసం బలంగా పోరాడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు వంటి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆయన ప్రజల కోసం బతికే మనిషని అన్నారు. శనివారం గూడూరు పరిధిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మహిళ శ్రామిక శక్తితో భువనమ్మ మాటామంతీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘సిలికా గనుల్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు మహిళ కార్మికుల జీతాలు అంతంతమాత్రమే. ఒక్కోసారి వారికి జీతాలు రావట్లేదు. మహిళా కార్మికులకు ప్రభుత్వం కార్డులు ఇవ్వడం లేదు. తగిన భద్రత లేక అనారోగ్యానికి గురవుతున్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి అన్ని వర్గాలకు మంచి పథకాలు తెస్తుంది. ప్రతి వర్గం గురించి ఆలోచించి చంద్రబాబు పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి కార్మికుడికి ఇల్లు, మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకు విద్య అందిస్తారు. మహిళ కోసం కూటమి కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చింది. ఇందులో భాగంగానే సూపర్‌6 తెచ్చారు. దీన్ని గడప గడపకు తీసుకెళ్లాలి’ అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు.

భువనేశ్వరి ప్రసంగిస్తుండగా చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటున్న కార్యకర్త

బాధిత కుటుంబానికి భరోసా

‘వాళ్లు అందరినీ భయ పెడతారు.. భయపెట్టిస్తారు.. వాళ్లు అంతే ప్రజలకు మంచి చేయాలని కోరుకోరు.. భయపడకుండా చేయిచేయి కలిపి పోరాడుదాం.. నిజాన్ని గెలిపిద్దాం..’ అంటూ తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. వాకాడు మండలం తిరుమూరు ఎస్సీకాలనీలో పంచాయతీ వార్డు మాజీ సభ్యులు, తెదేపా కార్యకర్త పిడుగు వెంకటస్వామి చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఆయన కోడలికి ఉద్యోగం అడగ్గా.. తెదేపా అధికారంలోకి రాగానే ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మనుమరాలి అనారోగ్యాన్ని చూడాలని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌కు సూచించారు.

బాధిత కుటుంబానికి సంతాప పత్రాన్ని అందిస్తున్న నారా భువనేశ్వరి

మహిళల ఆశీస్సులు అందుకుంటూ..

ఘనస్వాగతం: భువనేశ్వరికి అడుగడుగునా మహిళలు ఘనస్వాగతం పలికారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల తెదేపా నేతలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  ‘అందరూ చేయిచేయి కలిపి అన్యాయాన్ని ఎదుర్కొందాం.. నిజాన్ని గెలిపిద్దాం’ అంటూ భువనేశ్వరి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పంచుమర్తి అనురాధ, మాజీ ఎంపీలు పనబాక లక్ష్మి, నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, మహిళా నేతలు, మండల తెదేపా నేతలు మధురెడ్డి, కృష్ణమూర్తి, కుంచం దయాకర్‌, గౌస్‌బాషా, మాజీ జడ్పీటీసీ సభ్యులు బత్తిన ప్రమీల, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

భువనేశ్వరి పర్యటన సందర్భంగాపరిశీలన చేస్తున్న వీఎస్‌టీ సభ్యులు


బీమా సాయం రాలేదు: షాబీరా

నా భర్త నాలుగేళ్ల కిందట ప్రమాదంలో గాయపడ్డారు. ఇల్లు అమ్మి  వైద్యసేవలు అందించాను. ఆయన చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నాలుగేళ్లయినా ఇప్పటి వరకు బీమా సొమ్ము రాలేదు.


జీతాలు పెంచట్లేదు : రమాదేవి

మేం రోజు కూలీకి వెళ్తే రూ.260 వస్తుంది. విద్యుత్తు ఛార్జీలు పెరగడంతో వేతనం పెంచడం లేదు. చంద్రబాబు హయాంలో ఒక్కపైసా ఖర్చు చేయకుండానే మా పాపను చదివించాం. నర్సింగ్‌ కోసం డబ్బు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మా పాపకు బాగోలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.  


ఆడపిల్లలతో ఎలా బతకాలి : మణెమ్మ

నాకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త చనిపోయి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదు. రూ.2 లక్షలు ఇస్తామన్నా ఇవ్వలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఎలా బతకాలి. ఉపాధి పథకం కింద వంద రోజులు సరిపోవట్లేదు. దీన్ని 200 రోజులకు పెంచాలి.


కలలకు రెక్కలు వచ్చేనా? : శ్రావణి

నేడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నా. మా నాన్న చనిపోయారు. ఇప్పుడు చదివే పరిస్థితి లేదు. మాకు కలలకు రెక్కలు కార్యక్రమం ద్వారా సాయం అందించాలని కోరుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని