logo

‘హమీ’తుమీ తేల్చవేం జగన్‌

మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు.

Updated : 28 Apr 2024 04:37 IST

మాట ఇచ్చి మడమ తిప్పడమే ఆయన నైజం

ఈనాడు-తిరుపతి: మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. అమలు కాని హామీలు ఎన్నైనా ఇస్తారు.. కానీ పనులు చేయరు. అమలు అసలే కనరు. ఎందుకంటే మడమ తిప్పడమే ఆయన నైజం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాలో పర్యటించిన పలు సందర్భాల్లో అనేక హామీలిచ్చినా ఒక్కటీ నెరవేర్చలేదు. పనులు చేపట్టేందుకు జిల్లాకు పైసా కేటాయించలేదు. ఎన్నికల వేళ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించేందుకు ఆదివారం ఆయన మరోసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ‘హామీ’తుమీ తేల్చాలని ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

తాత్కాలికంతో సరి..!

హామీ: ‘భారీ వర్షాలకు స్వర్ణముఖి నదిపై కూలిన వంతెనలు పునర్నిర్మిస్తాం.. పనులు పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తాం.’ - పాపానాయుడుపేట, పాడిపేట ప్రాంతాల్లో ఇచ్చిన హామీ.
ప్రస్తుత స్థితి: కూలిన వంతెనలను పట్టించుకోలేదు. తాత్కాలికంగా వంతెనల కింద సిమెంటు పైపులు, ఇసుక బస్తాలు వేసి బీటీ రహదారి నిర్మించారు. శాశ్వత పనులకు రూ.190 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఒక్కపైసా విడుదల చేయలేదు.

ఉషోదయం ఎక్కడ?

హామీ: ‘ఇనగలూరులో రూ.800 కోట్లతో అపాచీ సంస్థ పరిశ్రమ 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇక్కడ 80 శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలో సరికొత్త ఉషోదయం మొదలవుతుంది.’

భూమిపూజ సందర్భంగా సీఎం చేసిన ప్రకటన


ప్రస్తుత స్థితి: భూమి పూజ చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు కనీసం పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పరిశ్రమ ఏర్పాటు కాకపోవడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయి.


ఇసుక మేటేసినా..

హామీ: ‘పంట నష్టపోయిన రైతులు ఎవరూ భయపడవద్దు. బాధితులకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తాం. వారం వ్యవధిలోనే ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా చూస్తాం.. స్వర్ణముఖి నదిపై బ్యారేజీ నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తాం’

వాకాడు మండలంలో పర్యటన సందర్భంగా ఇచ్చిన మాట.


ప్రస్తుత స్థితి: రైతులకు అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. బాధితులకు సరకులు కూడా తక్కువ తూకంతో ఇచ్చినట్లు ఎమ్మెల్యేనే స్వయంగా ఆరోపించారు. ఇసుక మేటలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వాటిని తొలగించేందుకు రూ.లక్షల్లో ఖర్చయితే రూ.వేలల్లో పరిహారం ఇచ్చి మమ అనిపించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టలేదు. స్వర్ణముఖి నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.


పనులన్నీ తెదేపా హయాంలోనే..

హామీ: ‘వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్తూరుపాడు ప్రాజెక్టు పూర్తికి సవరించిన అంచనాల మేరకు రూ.553 కోట్ల నిధులు మంజూరు చేసి ఆమోదముద్ర వేస్తాం.’

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు.


ప్రస్తుత స్థితి: నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించినా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. తెదేపా హయాంలో జరిగిన పనులు మినహా ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. ఆల్తూరుపాడు చెరువు పనులు చేపట్టకపోవడంతో నీరు లేక మూడేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల, తిరుపతి దాహార్తి తీర్చేందుకు మరింత సమయం పట్టనుంది.

తిరుచానూరు ప్రాంతంలో వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు పరిశీలిస్తున్న సీఎం జగన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని