logo

ఇదేంది జగన్‌.. ఇలా ముంచేశావ్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు..

Published : 28 Apr 2024 02:50 IST

వేతన సవరణ అమలెక్కడ?
12వ పీఆర్‌సీ అమలు జాప్యం
మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌, కాణిపాకం, పూతలపట్టు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. ఫలితంగా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యక్తిగతంగా రూ.లక్షల్లో నష్టం జరిగింది.. హక్కుగా దక్కాల్సిన ఫలాల్ని భిక్షమెత్తేట్లు చేసిన పాలకుల వైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.. ఎంతో నమ్మకంతో తమ సమస్యలు పరిష్కరిస్తాడని నమ్మి ఓటేస్తే చివరకు సీఎం జగన్‌ ఇలా ముంచేశాడని బయటకు చెప్పుకోలేక ఉద్యోగ వర్గాలు అంతర్గతంగా మధనపడుతున్నాయి.. అసలు తమ సమస్యలు ఎన్నటికి పరిష్కారమవుతాయి.. తమకు అందాల్సిన వేతన ప్రయోజనాలు ఎప్పటికి అందుతాయోనని ఆయా వర్గాలు కన్నీటిపర్యంతమై తమ గోడు వెళ్లబోసుకోలేక వేకళ్ల ఎదురుచూస్తున్నాయి.


సకాలంలో డీఏలు ఇవ్వలేదు..

ఉద్యోగులకు సకాలంలో డీఏలు ఇవ్వకుండా 11వ పీఆర్‌సీలోనే ఐదు డీఏలు కలిపేశారు. దీంతో ఉద్యోగుల వేతనాలు పెద్దగా పెరగలేదు. పీఆర్‌సీ అరియర్స్‌, డీఏ అరియర్స్‌ను వేర్వేరుగా లెక్కించాలి. అప్పుడే ఉద్యోగికి న్యాయం జరుగుతుంది.

సోమశేఖర్‌నాయుడు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్‌


పాత పీఆర్‌సీ బకాయిలు రాలేదు..

పాత పీఆర్‌సీ బకాయిల చెల్లింపులు పూర్తిగా జరగకముందే 12వ పీఆర్‌సీ వేశారు. దీంతో వేతనాల్లో మరింత వ్యత్యాసం రానుంది. కనీసం యూనియన్లతో చర్చించకుండా చేసిన ప్రభుత్వ అనాలోచిత చర్యతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

సురేష్‌, అధ్యక్షుడు. యూటీఎఫ్‌, ఐరాల మండలం


రెండు డీఏలే ఇచ్చారు..

డీఏలు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. పీఎఫ్‌, ఈఎల్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కాలేదు. సీపీఎస్‌ ఉద్యోగులకు 90 శాతం నగదు రీబ్యాక్‌ రావడం లేదు. పీఆర్‌సీ అమలుకాక పోవడంతో ఒక్కో ఉద్యోగికీ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లింది.

నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌, పూతలపట్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని