logo

శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది

వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

Updated : 28 Apr 2024 04:34 IST

స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను
జిల్లాలో 250 గ్రామాల్లో అంత్యక్రియలకు అవస్థలు


  • చిత్తూరులోని కట్టమంచి శ్మశానవాటిక నీవా నది పరివాహక ప్రాంతంలో ఉంది. శ్మశానవాటిక స్థలాన్ని తమకున్న రాజకీయ అండదండలతో కొందరు ఆక్రమించేశారు. ఈ ఆక్రమణపై పలుమార్లు ప్రజలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. 
  • పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలం పుణ్యసముద్రంలో అధికార పార్టీ నాయకులు శ్మశాన వాటికను ఆక్రమించారని అదే పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయడం గమనార్హం.

  • పలమనేరు మున్సిపాలిటీలోని మదనపల్లె రోడ్డులో లింగాయత్‌ల సామాజిక వర్గానికి శ్మశాన వాటిక పూర్వీకుల నుంచి ఉంది. ఈ శ్మశానవాటికను స్థానికంగా ఉన్న కొందరు ఆక్రమించి భవనాలు నిర్మించారు. ప్రస్తుతం దీనికి దారి సౌకర్యం లేదు. పలుమార్లు దారి సౌకర్యం కల్పించాలని మృతదేహాలతో రోడ్డుపై నిరసన తెలియజేసినా కనికరం చూసే నాథుడే కరవయ్యారు.

  • పుత్తూరు మున్సిపాలిటీలోని భవానీనగర్‌లో తిరుపతి-చెన్నై హైవే పక్కనే కొన్నేళ్లుగా శ్మశాన వాటిక ఉండేది. భూముల విలువ పెరగడంతో అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. రాత్రికి రాత్రే ఆ భూమిని చదును చేసి గ్రావెల్‌ తోలి ఆక్రమించేశారు. ఈ విషయాన్ని ఆ వార్డు కౌన్సిలర్‌ కేశవాచారి పలుమార్లు మున్సిపల్‌ సమావేశాల్లో ప్రస్తావించినా స్పందన కరవు.

  • పుత్తూరులోని మహాలక్ష్మీపురం దళితవాడవాసులకు గ్రామానికి పశ్చిమ ప్రాంతంలో శ్మశాన వాటిక ఉన్నా దానికి దారి లేదు. శ్మశానానికి వెళ్లే దారిలో ఉన్న పొలానికి రైతు కంచె వేశారు. వర్షం వస్తే శ్మశాన వాటికకు వెళ్లాలంటే ఇబ్బంది. రెవెన్యూ అధికారులు పున్నమి రిసార్ట్స్‌ పక్కనే ఖననం చేసుకోవాలని అనధికారికంగా ఆదేశాలిచ్చారు. అక్కడే మహాలక్ష్మీపురం గ్రామస్థులు ఖననం చేసుకుంటున్నారు. ఆ స్థలంలో వారు ఖననం చేయడానికి వీల్లేదని గతేడాది జులైలో అడ్డుచెప్పారు. దీంతో దళితవాడవాసులు మూడు గంటల నిరీక్షణ అనంతరం అధికారులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

పుత్తూరు: పల్లూరులో దారి లేక పొలాల మీదుగా మృతదేహాన్ని తీసుకెళ్తున్న గ్రామస్థులు(పాత చిత్రం)

న్యూస్‌టుడే యంత్రాంగం: వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,500కు పైచిలుకు గ్రామాలున్నాయి. 250 గ్రామాలకు శ్మశాన వాటికల్లేవు. సొంత పొలాల్లో, కాలువ గట్లపైన, చెరువుల్లో ఖననం చేయాల్సిన దుస్థితి.
ఎక్కడ ఖననం చేయాలి.. నగరి నియోజకవర్గంలో వంద పంచాయతీలున్నాయి. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. పుత్తూరు మండలంలో కశింకుప్పం హేబిటేషన్‌లోని సదాశివ ఎస్టీ కాలనీ, టీఆర్‌ కండ్రిగ ఎస్టీ కాలనీ వాసులు అటవీశాఖ భూమిలో అనధికారికంగా ఖననం చేసుకుంటున్నారు. తొరూరులో ఏటు గట్టున, కట్టకింద రామకృష్ణాపురం, కొత్త తిమ్మాపురంలో చెరువులో ఖననం చేస్తున్నారు. జీకేపురం, పైడిపల్లి, పైడిపల్లి దళితవాడ వాసులు ఏటి కాలువలో శవాలను పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. తడుకు, తిమ్మరాజుకండ్రిగ, గ్రామాల్లోనే ఇదే పరిస్థితి. నేషనూరు పరిధిలోని నేషనూరు, గట్టు, మొగిలమ్మ ఎస్టీ కాలని, తాయిమాంభాపురం, భవానీనగర్‌, పిళ్లారిపట్టు, చౌటూరు, భండారుపల్లి, ద్వారకానగర్‌, గంగమాంబా పురం, గట్టు వడ్డిఇండ్లు గ్రామస్థులు వాగులోనే ఖననం చేసుకోవాలి. వర్షం వస్తే సొంత పొలాల్లో వేసుకోవాల్సిందే. ఎస్టీ, ఎస్సీల పరిస్థితి అగమ్యగోచరం.  
అన్నీ తిప్పలే.. పలమనేరు పరిధిలో  కొలమాసనపల్లె, దేవదొడ్డి, పసుపత్తూరు, ధనరాజుపల్లె, బసవరాజు పురం, పెద్దబాహ్మణపల్లె గ్రామాల్లో శ్మశాన వాటికల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వి.కోటలో శ్మశాన వాటిక వివాదాల్లో చిక్కుకుంది. జీడీనెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌పురం మండలంలో నెలవాయి, పుల్లూరు క్రాస్‌ కాపుకండ్రిగ, వెదురుకుప్పం మండలంలో బొమ్మదొడ్డి, ధర్మాచెర్వు, జక్కదొన, కార్వేటినగరం మండలం బండిరేవు, పాలసముద్రంలో వీర్లగుడిపల్లెలలో శ్మశాన వాటికలు ల్లేవు. జీడీనెల్లూరు మండలంలో పేటనత్తం, ద్వారకానగరం, వీరకనెల్లూరు, నాశంపల్లె, కలిజవేడు కొండేపల్లి  ప్రజలు నీవానదిలో ఖననం చేస్తున్నారు. పూతలపట్టు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గంలోనే ఇదే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని