logo

అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.

Updated : 29 Apr 2024 10:14 IST

 సీఎం జగన్‌ పలుకు పలుకులో పరనింద
అభివృద్ధిపై ప్రస్తావించకుండా జిల్లా పర్యటన ముగింపు 

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రామ్‌కుమార్‌రెడ్డి, గురుమూర్తి

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, వెంకటగిరి, బాలాయపల్లి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. చేయని పనులు సైతం గొప్పగా చెప్పుకొనే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

చేనేతలను పట్టించుకోరా?

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక భారీగా విద్యుత్తు ఛార్జీలు పెంచిన అంశాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కడప జిల్లా కుక్కలదొడ్డి ప్రాంతం నుంచి నీటిని తరలించడం కష్టమవుతుందని గుర్తించిన చంద్రబాబునాయుడు తన హయాంలో తెలుగుగంగ ద్వారా బాలాజీ, మల్లెమడుగు జలాశయాలకు నీటిని తరలించాలని ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆల్తూరుపాడు జలాశయ పనులు ప్రారంభించగా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిల్చిపోయాయి. గతేడాది జులైలో వెంకటగిరి పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.553 కోట్లు మంజూరు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. పనులు ప్రారంభం కాలేదు. దీనిపై ప్రసంగంలో ప్రస్తావించలేదు. వెంకటగిరిని ఆనుకుని ఇనగలూరు వద్ద అపాచీ పరిశ్రమపై ఒక్క మాట మాట్లాడలేదు. గతంలో జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఒక్క పెద్ద పరిశ్రమ తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించింది లేదు. ఇప్పుడు కనీసం పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలు ఎక్కడా ఆయన ప్రసంగంలో చెప్పలేదు.

సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరుగుతున్న కార్యకర్తలు

ఏదీ ప్రణాళిక?

జిల్లా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమలు తెస్తే ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ జీడీపీ పెరుగుతుంది. దీనిపై ప్రణాళికలు లేవన్నట్లుగానే ఆయన ప్రసంగం ద్వారా తేలిపోయింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఇసుక, మద్యం, గ్రావెల్‌ ద్వారా దండుకోవడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

మద్యం, బిర్యానీ పంపిణీ..

సభకు జనాలను తరలించేందుకు స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మధ్యాహ్న సమయంలో వస్తారో లేదోనని ప్రజలను ఉదయమే ఆటోలు, ట్రాక్టర్లు, బస్సుల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలించారు. మహిళలకు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేయగా.. పురుషులకు బిర్యానీ, మందు పంపిణీ చేశారు. సీఎం మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు రాకపోవడంతో ఎండ వేడికి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. కొందరు ఎండ వేడికి తాళలేక మంచినీళ్ల ప్యాకెట్లతో ముఖం కడుక్కోవడంతోపాటు ఒంటిమీద, కాళ్ల మీద పోసుకుని సేదతీరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని